Telangana: సుశీ సంస్థల్లో సోదాలు

GST officials raids In sushee companies belongs Rajagopal Reddy - Sakshi

సుశీ ఇన్‌ఫ్రా, సుశీ అరుణాచల్‌ హైవేస్, సుశీ చంద్రగుప్త్‌ కోల్‌మైన్స్‌పై దాడులు

ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర జీఎస్టీ అధికారులు 

సుశీ ప్రధాన కార్యాలయంతో పాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు 

పన్ను చెల్లింపు లావాదేవీలు, పన్ను ఎగవేత సంబంధిత అంశాల పరిశీలన 

శాఖ కమిషనర్‌ నేతృత్వంలో రంగంలోకి 100 మందికి పైగా అధికారులు 

హార్డ్‌ డిస్క్‌లు, కీలకపత్రాలు స్వాదీనం! 

నేడు కూడా తనిఖీలు? 

‘ఉప ఎన్నిక’ తర్వాత జరుగుతున్న దాడులపై రాజకీయ వర్గాల్లో చర్చ 

సుశీ ఇన్‌ఫ్రాకు ఎండీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కుమారుడు 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ సంస్థపై రాష్ట్ర వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లోని సుశీ ప్రధాన కార్యాలయంతో పాటు ఆ సంస్థ, అనుబంధ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న కొందరి ఇళ్లపై దాడులు జరిగాయి. సుశీ అరుణాచల్‌ హైవేస్‌ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్‌ కోల్‌మైన్స్‌ సంస్థల్లో కూడా సోదాలు నిర్వహించారు.

పన్నుల శాఖ కమిషనర్‌ నీతూప్రసాద్‌ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. 100 మందికి పైగా అధికారులు 25 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, సీపీయూ, హార్డ్‌ డిస్‌్కలను స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. పన్ను చెల్లింపు లావాదేవీలు, పన్ను ఎగవేత సంబంధిత అంశాలు పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించినట్టు జీఎస్టీ అధికారులు చెబుతున్నారు. దాడులకు సంబంధించిన వివరాలపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. సోమవారం ఉద­యం ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగగా, మంగళవారం కూడా ఈ తనిఖీలు కొనసాగే అవకాశమున్నట్టు పన్నుల శాఖ వర్గాలు వెల్లడించాయి. 

ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత..! 
సుశీ ఇన్‌ఫ్రా సంస్థకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడు సంకీర్త్‌రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ అకౌంట్‌ నుంచి పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించారనే ఆరోపణలు వచ్చాయి. మంత్రి కేటీఆర్‌ స్వయంగా ఈ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడా టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. ఎవరెవరికి ఎంత నగదు సుశీ అకౌంట్‌ నుంచి వెళ్లిందనే వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అయితే ఆ ఖాతా నుంచి డబ్బు వెళ్లిందనడంలో వాస్తవం లేదని సుశీ ఇన్‌ఫ్రాతో పాటు రాజగోపాల్‌రెడ్డి వర్గీయులు ఖండించారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత ఇప్పుడు సుశీ ఇన్‌ఫ్రాపై జీఎస్టీ అధికారులు దాడులు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.  

ఈడీ దాడులు జరిగిన కొద్ది రోజులకే..
మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత రాష్ట్రంలోని పలు మైనింగ్‌ కంపెనీలపై ఈడీ దాడులు జరిగాయి. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారని టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా సుశీ సంస్థల్లో రాష్ట్ర జీఎస్టీ అధికారుల దాడులు చేయడంతో.. టిట్‌ ఫర్‌ టాట్‌ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని అధికారుల చేత రాజగోపాల్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో తనిఖీలు చేయించిందా? అనే చర్చ జరుగుతోంది.  

రాజకీయ కోణం లేదంటున్న జీఎస్టీ శాఖ 
సుశీ సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో రాజకీయ కోణం లేదని పన్నుల శాఖ వర్గాలంటున్నాయి. ఈ తనిఖీలపై ఎలాంటి ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్న అధికారులు.. రాజకీయ ఆరోపణలను మాత్రం కొట్టిపారేస్తున్నారు. కాంట్రాక్టు వ్యాపారంలో ఉన్న సుశీ ఇన్‌ఫ్రా కూడా జీఎస్టీ డీలరేనని, రాష్ట్రంలోని ఏ డీలర్‌ (వ్యాపారి) కూడా పన్ను ఎగ్గొట్టకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉంటుందని, అందులో భాగంగానే సుశీ ఇన్‌ఫ్రాలో కూడా తనిఖీలు చేశామని చెబుతున్నారు.

పన్ను చెల్లింపు లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా? రిటర్నులు సకాలంలో ఫైల్‌ చేస్తున్నారా లేదా? పన్ను ఎగవేతకు ఎక్కడైనా ఆస్కారాలున్నాయా? అనే కోణంలోనే తనిఖీలు జరుపుతున్నామని అంటున్నారు. పన్నుల శాఖకు చెందిన అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సీటీవో స్థాయి అధికారులు తనిఖీల్లో పాల్గొంటున్నట్టు సమాచారం. కాగా ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలోని అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top