ఐదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు | Sakshi
Sakshi News home page

ఐదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు

Published Thu, Apr 11 2024 4:48 AM

Grain purchases in five districts - Sakshi

443 కేంద్రాల ద్వారా 31 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ 

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు : పౌర సరఫరాలశాఖ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. గత నెల మూడోవారం నుంచే నల్ల­గొండ, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్లు ప్రా­రంభం కాగా, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో కూడా కోతలు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పని­లో పౌరసరఫరాల సంస్థ బిజీగా ఉంది. మార్చి 25వ తేదీ నుంచే అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ సీజన్‌లో మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి 75.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే ప్రారంభించిన 443 కొనుగోలు కేంద్రాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఒకటి రెండు రోజుల తర్వాత కోతలు పెరిగి ..ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్‌ వంటి సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది.  

మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడేనా..? 
కొన్నేళ్లుగా ధాన్యం సేకరణ ప్రక్రియలో మిల్లర్ల జోక్యం పెరిగింది. కొనుగోలు కేంద్రాలలోనే తరుగు పేరుతో క్వింటాల్‌కు 5 కిలోలకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి అదనంగా తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. తీరా ధాన్యం మిల్లులకు పంపిన తర్వాత కూడా రంగు మారిందని, తాలు, తేమ అధికంగా ఉందని కారణాలు చెబుతూ మిల్లర్లు నేరుగా రైతులకు ఫోన్లు చేయించి వేధించి తరుగు తీయడం పరిపాటిగా మారింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం తప్ప, కొర్రీలు పెడితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌.చౌహన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. మిల్లులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో కూడా తరుగు, హమాలీ పేరుతో కిలోల కొద్దీ ధాన్యం రైతుల నుంచి దోచుకునే విధానానికి స్వస్తి పలకాలని రైతులు కోరుతున్నారు.  

అందుబాటులో 14 కోట్ల గన్నీ సంచులు 
రాష్ట్రంలో ఈసారి కొనుగోలు కేంద్రాలకు 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినా, ఈసారి దిగుబడి, ధాన్యం విక్రయాల తీరును బట్టి చూస్తే 50 నుంచి 60 లక్షల మెట్రిక్‌ టన్నులలోపే ధాన్యం సేకరణ జరిగే అవకాశముందని పౌరసరఫరా వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈసారి వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని ప్రభుత్వం భావించింది.

అందులో ఇప్పటికే 14 కోట్ల గన్నీ సంచులను పౌరసరఫరాల శాఖ అందుబాటులో ఉంచింది. ఈ గన్నీ బ్యాగులు 56 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లకు ఇవి సరిపోతాయి. మిగతా గన్నీ బ్యాగులను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా, వాటి అవసరం ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు.  

Advertisement
 
Advertisement