గ్రేటర్‌..డబుల్‌ డెక్కర్‌! | Government Plans Metro Expansion In Hyderabad's North City, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌..డబుల్‌ డెక్కర్‌!

Jan 7 2025 7:58 AM | Updated on Jan 7 2025 9:30 AM

Government Plans Metro Expansion in Hyderabad's North City

నార్త్‌సిటీ రెండు రూట్లలో డబుల్‌ డెక్కర్‌ కారిడార్లే.. 

ఎలివేటెడ్‌ పియర్స్‌పైనే మెట్రో అలైన్‌మెంట్‌ 

నిర్మాణంపైన 30 శాతం తగ్గనున్న వ్యయం 

తుదిదశలో భూసేకరణ ప్రక్రియ 

ప్రస్తుతం నాగ్‌పూర్‌లోనే అతిపెద్ద డబుల్‌డెక్కర్‌  

త్వరలో నోటిఫికేషన్‌కుహెచ్‌ఎండీఏ సన్నాహాలు  

సాక్షి, సిటీబ్యూరో: నార్త్‌సిటీకి డబుల్‌ డెక్కర్‌ కారిడార్లపైన స్పష్టత వచ్చింది. మొదట ప్యారడైజ్‌ నుంచి డెయిరీఫామ్‌ వరకు 5.32 కిలోమీటర్ల వరకే ప్రతిపాదించారు. తాజాగా జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ మార్గంలోనూ డబుల్‌ డెక్కర్‌  నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు కారిడార్లు వినియోగంలోకి వస్తే దేశంలోనే అతిపెద్ద డబుల్‌డెక్కర్‌ నెట్‌వర్క్‌ కలిగిన  నగరంగా హైదరాబాద్‌ రికార్డు సాధించనుంది. ప్రస్తుతం నాగ్‌పూర్‌లో మాత్రమే 5.6 కిలోమీటర్ల డబుల్‌ డెక్కర్‌ ఉంది. జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు ప్రతిపాదించిన 22 కిలోమీటర్ల మెట్రో మార్గంలో సుమారు 18 కిలోమీటర్లు డబుల్‌ డెక్కర్‌ రానుంది. 

దీంతో నేలపైన, మొదటి అంతస్తు ఎలివేటెడ్‌లో వాహనాలు రాకపోకలు సాగించనుండగా, రెండో అంతస్తులో మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ప్యారడైజ్‌ నుంచి మేడ్చల్‌ వరకు ప్రతిపాదిత 23 కిలోమీటర్ల మెట్రో రూట్‌లో ఇంచుమించు సుచిత్ర వరకు డబుల్‌ డెక్కర్‌ ఉంటుంది. అక్కడి నుంచి మేడ్చల్‌ వరకు ఎలివేటెడ్‌ మెట్రో కారిడార్‌ వస్తుందని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ఈ రెండు మార్గాల్లో మెట్రో నిర్మాణ వ్యయం  30 శాతం వరకు తగ్గనున్నట్లు అంచనా.  

మెట్రో కోసం భూసేకరణ అవసరం లేదు.. 
ప్రస్తుతం నాగ్‌పూర్‌ కాంప్టీరోడ్డులో ఎల్‌ఐసీ స్క్వేర్‌ నుంచి  ఆటోమోటివ్‌ స్క్వేర్‌ వరకు  5.6 కిలోమీటర్ల  డబుల్‌ డెక్కర్‌  ఉంది.సుమారు రూ.573 కోట్లతో దీనిని నిర్మించారు.అంత కంటే ముందు వార్ధా రూట్‌లో నిర్మించిన 3.14 కిలోమీటర్ల కంటే  ఇది  ఎక్కువ. ఈ  డబుల్‌ డెక్కర్‌ను  ఇంజినీరింగ్‌ అద్భుతంగా భావిస్తారు. రైలు, రోడ్డు, మెట్రో ఒకదానిపైన మరొకటి రాకపోకలు సాగిస్తున్నట్లుగా ఉంటాయి. నగరంలో  ఉత్తరం వైపు  నిరి్మంచనున్న  డబుల్‌  డెక్కర్‌ మరో  అద్భుతంగా ఆవిష్కృతం కానుందని  నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రస్తుతం ఎలివేటెడ్‌ కారిడార్‌ల కోసం  హెచ్‌ఎండీఏ భూసేకరణ చేపట్టిన  దృష్ట్యా  మెట్రో కోసం ప్రత్యేక సేకరణ అవసరం లేదు.మెట్రో అలైన్‌మెంట్‌ల కోసం ఎలివేటెడ్‌ కారిడార్‌ పియర్స్‌ ఎత్తును పెంచుతారు. ఈ పియర్స్‌పైనే మెట్రో లైన్‌లు నిరి్మస్తారు. ఈ రెండు  మార్గాలపైన  హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌మెట్రో రైల్‌ లిమిటెడ్‌ సంస్థ త్వరలో  డీపీఆర్‌ రూపొందించనున్న  దృష్ట్యా  అప్పుడే  డిజైన్‌లపైన మరింత స్పష్టత  వస్తుందని  అధికారులు  తెలిపారు. ప్రస్తుతం  ఈ రెండు రూట్లలో హెచ్‌ఎండీఏ భూసేకరణ  కొనసాగిస్తోంది. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దాంతో ఎలివేటెడ్‌ కారిడార్‌ టెండర్‌లకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు  అధికారులు  తెలిపారు. 

డెయిరీఫామ్‌ నుంచి ఎలివేటెడ్‌ మెట్రో.. 
ప్యారడైజ్‌ నుంచి మేడ్చల్‌ 23 కిలోమీటర్లు, జేబీఎస్‌ నుంచి శామీర్‌ పేట్‌ వరకు 22 కిలోమీటర్ల  మార్గంలో మెట్రో కారిడార్లను నిరి్మంచనున్నారు. మేడ్చల్‌ రూట్‌లో తాడ్‌ బంండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ వరకు మెట్రో రానుంది. ఇదే మార్గంలో డెయిరీఫామ్‌ వరకు 5.32 కిలోమీటర్లు డబుల్‌ డెక్కర్‌ ఉంటుంది. అలాగే  జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ మీదుగా శామీర్‌ పేట్‌ కు 22 కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్‌ విస్తరించి ఉంటుంది.ఈ రూట్‌లో దాదాపు పూర్తిస్థాయిలో డబుల్‌ డెక్కర్‌ వచ్చే అవకాశం ఉంది. 

ఫోర్త్‌సిటీకి కూడా డబుల్‌ డెక్కరే.. 
నార్త్‌సిటీ  తరహాలో ఫోర్త్‌సిటీకి కూడా డబుల్‌ డెక్కర్‌  చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మెట్రో రెండో దశలో రూ.6000 కోట్ల అంచనాలతో  సుమారు  41  కిలోమీటర్లు పొడిగించనున్న సంగతి తెలిసిందే.రెండో దశలో 5 కారిడార్‌లకు మాత్రమే డీపీఆర్‌ పూర్తి చేసి  రాష్ట్రప్రభుత్వ ఆమోదం అనంతరం కేంద్రం అనుమతికి  పంపించారు. తాజాగా నార్త్‌సిటీకి 3 నెలల్లో  డీపీఆర్‌  సిద్ధం చేయాలని  సీఎం  ఆదేశించిన సంగతి  తెలిసిందే.అదేవిధంగా ఫోర్త్‌సిటీ మెట్రోపైన కూడా  దృష్టి సారించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement