
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం పకడ్బందీగా జీవో
న్యాయ పరమైన చిక్కులు రాకుండా రూపకల్పన చేస్తున్న అధికారులు
సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటుతనం, జనాభాకు తగ్గ ప్రాతినిధ్యంపై జీవోలో వివరణ
డెడికేటెడ్ కమిషన్ నుంచి మరో నివేదిక కోరిన ప్రభుత్వం?
ఈ నివేదిక రాగానే వారం రోజుల్లో జీవో విడుదల చేసే చాన్స్!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి ముందుకెళుతోంది. ఇటీవల మంత్రిమండలి ఆమోదించి పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం లభిస్తుందన్న అంచనాతో.. తదుపరి ప్రక్రియలో భాగంగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసే దిశలో అడుగులు వేస్తోంది.
ఈ జీవో రూపకల్పన కోసం.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 50 శాతానికి మించి ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ చట్టం–2018కి చేసిన సవరణ, ఈ మేరకు ఆమోదించిన ఆర్డినెన్స్, నూతన మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ సమర్పించే నివేదికలను ఆధారంగా చేసుకోనుంది.
ఆర్డినెన్స్‌కు మంత్రివర్గ ఆమోదం అనంతరం కొత్త విధివిధానాలతో మరో నివేదిక ఇవ్వాలని డెడికేటెడ్ కమిషన్‌ను కోరిన ప్రభుత్వం.. ఆ నివేదిక వచ్చిన తర్వాత వారం రోజుల్లోపు న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా జీవో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఆర్డినెన్స్‌ను, కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ..
పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 285 (ఏ)కు చేసిన సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి మించవచ్చు అని మాత్రమే ఆర్డినెన్సులో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్డినెన్సుతో పాటు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంటారని చెబుతున్నాయి. ఈ జీవో మేరకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దఖలు పడతాయని వివరిన్నాయి.
చట్టానికి చేసిన సవరణే ప్రాతిపదికగా జీవో
ప్రభుత్వం జీవో విడుదల చేసే జీవో న్యాయ సమీక్షలోనూ నిలబడే విధంగా అవసరమైన అన్ని అంశాలను ప్రస్తావిస్తూ వివరణాత్మకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితిని ప్రత్యేక పరిస్థితుల్లో పెంచేందుకు పంచాయతీ రాజ్ చట్టానికి చేసిన సవరణనే ఈ జీవోకు ప్రాతిపదికగా ఉంటుందని అంటున్నారు.
బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటు స్థాయి, జనాభాకు తగిన ప్రాతినిధ్యం అనే అంశాల ప్రాతిపదికన చట్టాన్ని సవరించామని, ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పేర్కొంటూ రిజర్వేషన్ల పెంపును సమర్థించే కోణంలో జీవోకు రూపకల్పన చేస్తున్నామని వెల్లడిస్తున్నారు.