వివాదాల్లో మేయర్‌ గద్వాల్‌.. సోషల్‌ మీడియాలో విమర్శలు

GHMC Mayor Gadwal Vijayalakshmi Trolled Her Comments Over Power Cut - Sakshi

మేయర్‌ వ్యవహార శైలిపై సోషల్‌ మీడియాలో విమర్శలు 

మొన్న ‘వరద’లపై వ్యాఖ్యలు.. నేడు ‘విద్యుత్‌ జనరేటర్‌’పై..  

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ మేయర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి ఇంకా నెలరోజులు కాలేదు...అప్పుడే గద్వాల్‌ విజయలక్ష్మి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆమె మాటలు, చేతలు ఎందుకనోగానీ వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మేయర్‌ హోదాలో ఒక టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరదలపై చేసిన వ్యాఖ్యలు, అందుకు ఆమె ప్రతిస్పందన జనం ఇంకా మరచిపోక ముందే జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఎన్నికల కరపత్రాల పంపిణీ వివాదానికి తావిచ్చింది. తాజాగా క్యాంప్‌ ఆఫీస్‌కు (ఇంటికి) 25 కేవీ జనరేటర్‌ కావాలంటూ కమిషనర్‌కు నోట్‌ పెట్టడం దుమారం రేపుతోంది.

ఓవైపు ప్రభుత్వం 24 గంటలపాటు కోతల్లేని నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెబుతుంటే, తరచూ విద్యుత్‌ కోతల వల్ల పనులకు అంతరాయం కలుగుతూ, రోజువారీ పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ‘నోట్‌’లో పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీన ఆమె రాసిన ఈ నోట్‌ కాపీ వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.  దీంతో, శుక్రవారం సాయంత్రం వివరణనిస్తూ మేయర్‌  విజయలక్ష్మి పత్రికా ప్రకటన జారీ చేశారు. తన నివాసం వద్ద విద్యుత్‌లైన్ల నిర్మాణానికి తవ్వకాలు జరుగుతున్నందున విద్యుత్‌ అంతరాయం కలుగుతోందని, అందువల్లే తాత్కాలికంగా విద్యుత్‌ జనరేటర్‌ ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్‌ను కోరినట్లు పేర్కొన్నారు. అంతేతప్ప నగరంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉందని  తాను పేర్కొన్నట్లుగా కొన్ని ప్రసారమాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవమని, ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా ఉన్న వీటిపై తానూ తీవ్ర వ్యధ చెందుతున్నానని  వివరించారు.  

బయటకు పొక్కడంపై ఆరా.. 
ఇదిలా ఉండగా, కమిషనర్‌కు మేయర్‌ పంపిన నోట్‌ ప్రతి బయటకు ఎలా వెళ్లిందని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు. సదరు సదుపాయం సమకూర్చేందుకుగాను నోట్‌ కాపీ ఎవరెవరి దగ్గరకు వెళ్లింది..ఎక్కడ లీకై ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. 

మేయర్‌ గౌరవ వేతనం రూ.50 వేలు, కార్పొరేటర్లకు రూ.6 వేలు 
పాలకమండలి సభ్యుల జీతభత్యాలూ చర్చనీయాంశంగా మారాయి. కార్పొరేటర్లకు నెలకు రూ.6 వేల గౌరవ వేతనం ఉండగా, మేయర్‌కు రూ.50 వేలు, డిప్యూటీ మేయర్‌కు రూ.25 వేలుగా ఉంది. రూ.4 వేల ఫోన్‌బిల్లుతోపాటు కార్పొరేటర్‌ కుటుంబానికి రూ.5 లక్షల వరకు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం ఉంటుంది. మేయర్, డిప్యూటీ మేయర్లకు వాహనాల సదుపాయంతోపాటు కార్యాలయ ఖర్చులు కూడా చెల్లిస్తున్నారు. తమ గౌరవ వేతనాలు పెంచాల్సిందిగా గత పాలకమండలి నుంచే కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గౌరవ వేతనమనేది జీతం కాదని, ప్రజాసేవ చేస్తామని వచ్చేవారు ఎక్కువగా ఆశించవద్దని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు. 
 
పన్నులు వసూలు చేయొద్దు: బీజేపీ కార్పొరేటర్లు 
గత సంవత్సరం నుంచి కరోనా వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారినందున ఆస్తిపన్ను వసూళ్లు, ట్రేడ్‌లైసెన్సుల ఫీజులు వసూలు చేయరాదని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు శుక్రవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.  

చదవండి: మేయర్‌ అసంతృప్తి.. అస్సలు బాలేదంటూ కామెంట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top