టీఆర్‌ఎస్‌ డివిజన్‌ ఇన్‌చార్జీల జాబితా ఇదే!

GHMC Elections 2020 TRS Division In Charge List - Sakshi

181 మందితో ‘గులాబీ’ వ్యూహం

బల్దియా పోరు కోసం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీల జాబితా

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చోటు

శివారు ప్రాంతాల మేయర్లు, కార్పొరేషన్ల చైర్మన్లకూ బాధ్యతలు  

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచార వ్యూహం అమలు, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు 150 డివిజన్లకు సంబంధించి 181 మందితో కూడిన భారీ జాబితాను టీఆర్‌ఎస్‌ రూపొందించింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావుతోపాటు మరో 11 మంది మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లతోపాటు జీహెచ్‌ఎంసీకి శివారుగా ఉన్న పలు మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లను ఇన్‌చార్జీలుగా నియమించింది. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు కూడా ఇన్‌చార్జీల బాధ్యతలు అప్పగించింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులను కూడా ఇందులో చేర్చింది. నామినేషన్ల దాఖలు మొదలుకొని అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచార వ్యూహం అమలు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, రాష్ట్రస్థాయి నాయకత్వానికి డివిజన్లలోని రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించడం వంటి బాధ్యతలను ఇన్‌చార్జీలు నిర్వర్తించాల్సి ఉంటుంది. గ్రేటర్‌ మం త్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలకు డివిజన్‌ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మినహాయింపు ఇచ్చారు. 

హైదర్‌నగర్‌ ఇన్‌చార్జీగా కేటీఆర్‌ 
హైదర్‌నగర్‌ డివిజన్‌ ఇన్‌చార్జీగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇతర డివిజన్ల లో రోడ్‌ షోలు, సభ లు, సమావేశాల్లో పాల్గొననున్నారు. హైదర్‌నగర్‌ డివిజన్‌లో టెస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు కేటీఆర్‌తోపాటు సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావు భారతీనగర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాంధీనగర్‌ డివిజన్‌ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. పాతబస్తీ పరిధిలోని పలు డివిజన్లలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్పొరేషన్‌ చైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు. శివారు డివిజన్లలో ఇతర జిల్లాల నుంచి వలస వచ్చినవారే ఎక్కువ సంఖ్యలో ఓటర్లుగా ఉన్నందున  ఆయా జిల్లాల మంత్రులతోపాటు జెడ్పీ చైర్మన్లకు డివిజన్‌ ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించారు.  
టీఆర్‌ఎస్‌ డివిజన్‌ ఇన్‌చార్జీల జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top