గజ్వేల్ తహసీల్దార్ స్వామి వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్
రైతునుద్దేశించి తహసీల్దార్ హేళన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
సాక్షి, తెలంగాణ: సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ స్వామి ఓ రైతును హేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలు శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు ఏసు, అతని బంధువుల భూములను ట్రిపుల్‌ఆర్ (రీజినల్ రింగు రోడ్డు) నిర్మాణంలో ప్రభుత్వం సేకరించింది. నష్టపరిహారం వాటాల పంపిణీ అంశంలో ఏసుకు అతని బంధువుల మధ్య వివాదం తలెత్తింది.
ఈ విషయమై గత కొన్ని నెలల క్రితం బాధిత రైతు ఏసు గజ్వేల్ తహసీల్దార్ స్వామి వద్దకు వచ్చి తన సమస్య పరిష్కరించాలని కోరాడు. ఈ సందర్భంగా తహసీల్దార్ ‘హేయ్...బతికే ఉన్నవా? ఎప్పుడూ పురుగు మందు తాగుతా అంటవ్ కదా.... పురుగుల మందు తాగలే? అంటూ అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంలో బాధిత రైతు ‘సచి్చపోతున్నం...అట్లెట్ట.. మా సమస్యంటే నవ్వొస్తుందా?’అంటూ బదులిచ్చారు.
ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో తహసీల్దార్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రైతుల జీవితాలంటే ఇంత చిన్నచూపా? అంటూ పలువురు మండిపడ్డారు. తహసీల్దార్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బాధిత రైతు తమ సమస్య పరిష్కారమైందంటూ చేసిన మాటల వీడియో సైతం శనివారం నాడే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాగా, రెండు వీడియోలు శనివారం రోజే వైరల్ కావడం గమనార్హం. అయితే, బాధిత రైతు ఏసు అప్పట్లో తన సమస్య పరిష్కారం కోసం సుమారు 10–15 పర్యాయాలు తహసీల్దార్ వద్దకు వెళ్లినట్లు తెలిసింది.
రైతును హేళన చేయలేదు : తహసీల్దార్
ఈ అంశంపై గజ్వేల్ తహసీల్దార్ వివరణ ఇస్తూ... రైతు ఏసును కావాలని తాను హేళన చేయలేదని, సరదాగా అలా మాట్లాడానని తెలిపారు. బాధిత రైతు సమస్యను తాను దగ్గరుండి పరిష్కరించానని చెప్పారు. ఈ సంఘటన అయిదారు నెలల క్రితం జరిగిందని, ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
పురుగు మందు తాగి చావలేదా అని అంటారా?: కేటీఆర్
రైతుల సమస్యలను పరిష్కరించి అండగా నిలవాల్సిన అధికారులే వారిని అవమానించేలా వ్యవహరించడం దారుణమని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. తన వ్యవసాయ భూమిని, జీవనాధారాన్ని కాపాడుకోవాలని గజ్వేల్ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లిన రైతును అధికారి కించపరిచిన తీరు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూమిని కాపాడుకునేందుకు సాయం కోరిన రైతుతో అధికారి మాట్లాడిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: ‘రేడియల్’ టెండర్లు రద్దు చేయాలి


