రూ. 600 కోట్ల ప్రజాధన నష్టంపై సమగ్ర విచారణ జరపాలి
సీఎం రేవంత్‌రెడ్డికి లేఖలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రేడియల్ రోడ్–2 టెండర్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. రూ. 3,296 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రేడియల్ రోడ్–2 టెండర్లను తక్షణమే రద్దు చేయాలన్నారు. తక్కువ ధరకు బిడ్లు వేసిన సంస్థలను పక్కనపెట్టి అధిక ధరలు కోట్ చేసిన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టారనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బుద్వేల్ నుంచి కొడంగల్ సమీపంలోని జాతీయ రహదారి వరకు 81.15 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి చేపట్టిన టెండర్లలో అక్రమాలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శనివారం కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
ఔటర్ రింగురోడ్డు నుంచి ఎన్‌హెచ్–167ఎన్ వరకు మూడు ప్యాకేజీలుగా చేపట్టిన పనులకు సెప్టెంబర్ 30తో బిడ్ల దాఖలు గడువు ముగిసిందన్నారు. అక్టోబర్ 8 నాటికే సాంకేతిక మూల్యాంకనం, అర్హతల పరిశీలన, ఆర్థిక బిడ్ల ప్రక్రియ పూర్తయినట్లు సంబంధిత పత్రాల్లో పేర్కొన్నారని తెలిపారు. ఇంత తక్కువ వ్యవధిలోనే 13 బిడ్ల పరిశీలన, అర్హతల నిర్ధారణ, కాంట్రాక్టు కేటాయింపులు ఎలా పూర్తిచేశారని ఆయన ప్రశ్నించారు. ప్యాకేజీలవారీగా బిడ్డర్ల సంఖ్య, కోట్ చేసిన ధరలు, తుది కేటాయింపుల వివరాలను వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్యాకేజీ–1లో జీకేసీ సంస్థను అనర్హంగా ప్రకటించి ప్యాకేజీ–3లో అర్హత కల్పించడంపై కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. బీవీఎస్‌ఆర్ కాంట్రాక్టు సంస్థకు మొదటి రెండు ప్యాకేజీల్లో అర్హత ఇచ్చి మూడో ప్యాకేజీలో తిరస్కరించడానికి కారణాలేమిటో వివరించాలన్నారు. ప్యాకేజీ–3లో సుమారు రూ. 1,034 కోట్ల పనులకు ఇద్దరు బిడ్డర్లే అర్హత సాధించారని, సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌ను మూడు ప్యాకేజీల్లోనూ అనర్హంగా ప్రకటించడంపై ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు.
దీనివల్ల రాష్ట్రానికి సుమారు రూ.600 కోట్ల నష్టం వాటిల్లుతుందన్న వాదనపై విచారణ జరపాలన్నారు. గత మూడేళ్లలో హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్ చేపట్టిన రూ. 100 కోట్లకుపైబడిన కాంట్రాక్టులపై కాగ్‌తో ప్రత్యేక ఆడిట్ చేయించడంతోపాటు రెండు రేడియల్ రోడ్లకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


