Forest Range Officer: ఇక్కడ కాపాడిన ప్రాణం.. అక్కడ పోయింది! | Forest Officer Srinivasa Rao Saved When Working At Bayyaram Forest | Sakshi
Sakshi News home page

FRO Srinivasa Rao: ఇక్కడ కాపాడిన ప్రాణం.. అక్కడ పోయింది!

Nov 23 2022 5:03 PM | Updated on Nov 23 2022 5:36 PM

Forest Officer Srinivasa Rao Saved When Working At Bayyaram Forest - Sakshi

ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు(ఫైల్‌)  

చెట్టమ్మకు చుట్టమైండు. అడవి తల్లికి దడి కట్టిండు. దండెత్తిన మూకలను తరిమికొట్టిండు. పచ్చదనాన్ని కాపాడినందుకు మావోల హిట్‌లిస్ట్‌కెక్కిండు. చివరికి గొత్తికోయల చేతిలో హత్యకు గురైండు. ఇప్పుడా వనం కన్నీళ్లు కారుస్తోంది. చెట్లన్నీ నిలబడి సంతాపం తెలుపుతున్నాయి. ‘శ్రీనివాస్‌ అమర్‌ రహే’ అని మౌనంగా నినదిస్తున్నాయి.  
– బయ్యారం

సాక్షి, మహబూబాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో ఎఫ్‌ఆర్‌ఓగా పనిచేస్తున్న చెలమల శ్రీనివాసరావును మంగళవారం గొత్తికోయలు హత్య చేశారు.  2011 నుంచి 2018 వరకు బయ్యారం అటవీశాఖ డీఆర్‌ఓగా శ్రీనివాసరావు పని చేశారు. ఆయన మృతితో ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది. అటవీరక్షణకు ఈప్రాంతంలోని సాయుధ దళాలతో పాటు లీగల్‌గా గట్టిపట్టు ఉన్న న్యూడెమోక్రసీ పార్టీని ఢీకొన్నారు. అటవీ రక్షణకు వెనకడుగు వేయలేదు. 2018లో పదోన్నతిపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని లింగాల ఎఫ్‌ఆర్‌ఓగా విధుల్లో చేరారు. ఆసమయంలో అటవీ రక్షణకు తనదైన శైలిలో పని చేశారు.

దీంతో పోడు, సాగుదారుల ఫిర్యాదుల ఆధారంగా మావోయిస్టులు ఎఫ్‌ఆర్‌ఓను టార్గెట్‌ చేశారు. ఈవిషయాన్ని ఇంటెలిజెన్స్‌ అధికారులు అటవీ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దీంతో ఎఫ్‌ఆర్‌ఓ ప్రాణాలు రక్షించుకునేందుకు ఆశాఖ అధికారులు భద్రాద్రి జిల్లా చండ్రుగొండకు బదిలీ చేశారు. చండ్రుగొండ రేంజ్‌ పరిధిలో సైతం శ్రీనివాసరావు అటవీ ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా కృషి చేశారు. ఈక్రమంలో ఆప్రాంతానికి వలస వచ్చిన గొత్తికోయలు శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకొని హత్య చేశారు. లింగాలలో కాపాడినా.. చండ్రుగొండలో మాత్రం కాపాడుకోలేకపోయామని అటవీశాఖ అధికారులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఉమ్మడి జిల్లాలో విషాదం...
బయ్యారం డీఆర్‌ఓగా, లింగాల ఎఫ్‌ఆర్‌ఓగా పని చేసిన శ్రీనివాసరావు హత్యకు గురవడంపై ఉమ్మడి జిల్లాలోని అటవీశాఖలో విషాదం నెలకొంది. అటవీ రక్షణకు శ్రీనివాసరావు చేసిన కృషిని ఈసందర్భంగా పలువురు అధికారులు కొనియాడారు. 
చదవండి: ఫారెస్ట్‌ అధికారి మృతిపై అనుమానాలు?.. హత్యకు ముందు శ్రీనివాసరావు వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement