
వ్యభిచారం కోసం బంగ్లాదేశ్ నుంచి నగరానికి వచ్చిన యువతి
బంజారాహిల్స్: ట్రావెల్ ఏజెంట్ సహకారంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి వ్యభిచారం చేసేందుకు అర్ధరాత్రి ఆ దేశ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. మొదట పశ్చిమ బెంగాల్ చేరుకున్న ఆమె అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి, చివరకు హైదరాబాద్‌కు చేరుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు వ్యభిచార గృహంపై చేసిన దాడిలో పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే..బంగ్లాదేశ్, మాణిక్‌గోంజ్ జిల్లాకు చెందిన యువతి (23) 2024లో రకీబ్ అనే ట్రావెల్ ఏజెంట్ సహాయంతో అర్ధరాత్రి దేశ సరిహద్దు దాటి పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించింది.
కొంతకాలం పాటు అతను ఆమెకు ఆ రాష్ట్రంలోనే ఆశ్రయం కల్పించాడు. ఆమెకు సిమ్‌కార్డు సైతం సమకూర్చి బెంగళూరుకు తీసుకెళ్లి అక్కడ మూజమ్ అనే వ్యక్తికి అప్పగించాడు. నెల రోజుల పాటు గదిలో ఉంచిన మూజమ్ ఆమెతో వ్యభిచారం చేయించాడు. ఆ తర్వాత ఆమె బెంగళూరులోని కోరమంగళకు పారిపోయి, బంగ్లాదేశ్‌కు చెందిన మిస్తి అనే స్నేహితుడిని కలుసుకుంది. అతని వద్ద రెండు నెలల పాటు తలదాచుకుంది. మిస్తి ఆమెను అఖిల్ అనే వ్యక్తికి అప్పగించగా, వ్యభిచారం చేస్తే ఎక్కువ జీతం ఇస్తానని అఖిల్ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో అఖిల్ సూచన మేరకు గత నెల 21న బస్సులో హైదరాబాద్ చేరుకున్న ఆమె అతని ఇంట్లో 10 రోజులు ఉంది.
ఆ తర్వాత సదరు యువతి మరిన్ని డబ్బులు సంపాదించేందుకు నాయక్ అనే వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించింది. నాయక్ ఆమెను గత నెల 30న జూబ్లీహిల్స్‌లోని మింట్ లీవ్స్ సరీ్వస్‌డ్ అపార్ట్‌మెంట్ రూం నెంబర్–112లో దించేందుకు క్యాబ్ ఏర్పాటు చేశాడు. కస్టమర్లను సంప్రదించి గదికి పంపుతానని నాయక్ ఆమెకు చెప్పాడు. అయితే వ్యభిచార దందాపై పోలీసులకు సమాచారం అందడంతో సదరు అపార్ట్‌మెంట్‌లోని గదిపై సోమవారం దాడులు నిర్వహించిన పోలీసులు బంగ్లాదేశ్ యువతితో పాటు కస్టమర్లను అరెస్టు చేశారు. యువతిని పునరావాస కేంద్రానికి తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.