కస్తూర్బా విద్యార్థినులకు ఫుడ్‌పాయిజన్‌  | Sakshi
Sakshi News home page

కస్తూర్బా విద్యార్థినులకు ఫుడ్‌పాయిజన్‌ 

Published Wed, Sep 13 2023 1:41 AM

Food poisoning for Kasturba students - Sakshi

ఖలీల్‌వాడి(నిజామాబాద్‌): నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో 120 మంది విద్యార్థినులకు ఫుడ్‌ పాయిజన్‌ అయింది. సోమవారం రాత్రి స్కూల్‌లో అన్నం, పప్పు, వంకాయకూర వంట చేశారు. రాత్రి భోజనం చేసిన తర్వాత 11.30 గంటలకు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ప్రారంభమైంది. దీంతో పాఠశాల సిబ్బంది పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే 84 మంది విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

కాగా, భీమ్‌గల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 36 మందిలో 16 మంది విద్యార్థినుల పరిస్థితి అలాగే ఉండటంతో వారిని మంగళవారం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమ్‌గల్‌ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 20 మంది విద్యార్థినులను మంగళవారం మధ్యాహ్నం డిశ్చార్జి చేశారు. నిజామాబాద్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాందీ హన్మంతు పరామర్శించారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్, విద్యాశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన పై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్‌ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందం వంట సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. రాత్రి చేసిన వంటకాల షాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement