
242.72 టీఎంసీలకు చేరిన నిల్వలు
మూడు, నాలుగు రోజుల్లో గేట్లుఎత్తే అవకాశం
శ్రీశైలంకు మళ్లీ పెరిగిన వరద ఉధృతి
ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్‌లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 67,800 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 564.4 అడుగుల్లో 242.72 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే ఇంకా 69 టీఎంసీలు అవసరం. ఎగువన ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో మూడు నాలుగు రోజుల్లో నాగార్జునసాగర్ నిండుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,56,327 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 68 వేల క్యూసెక్కులను దిగువన సాగర్‌కు విడుదల చేస్తున్నాయి.
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 20వేల క్యూసెక్కులు, హంద్రీ నీవా కోసం 1,013 క్యూసెక్కులను ఏపీ తీసుకుంటుండగా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తెలంగాణ తీసుకుంటోంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రధాన పాయతోపాటు మలప్రభ, ఘటప్రభలు వరదెత్తుతున్నాయి. దాంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 94వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 90 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.01 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 1.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.22 లక్షల క్యూసెక్కులను దిగు వకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌కి వస్తున్న 39,339 క్యూసెక్కుల వరదను వచ్చిందొచ్చినట్టుగా దిగువన శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు.