తెలంగాణ కొత్త సచివాలయంలో ఫైర్‌ యాక్సిడెంట్‌

Fire accident in Telangana new secretariat Building Updates - Sakshi

రెండో అంతస్తు వరకు వ్యాపించిన పొగ 

ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేదన్న పోలీసులు 

ప్రారంభోత్సవం యథాతథం అన్న అధికారులు 

అక్కడ ఉన్న వ్యర్థాలకు అంటుకోవడంతో ఎగసిన అగ్నికీలలు 

సాక్షి, హైదరాబాద్‌/ ఖైరతాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ తీరాన తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీనివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, కేవలం నాలుగు ఫ్లోర్లు పొగ చూరా­యని పోలీసులు తెలిపారు. స్వల్ప మరమ్మతులు మాత్రమే అవసరమవుతాయని, సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సచివాలయ ప్రారంభోత్సవ సమయం దగ్గరపడుతుండటంతో భవన నిర్మాణ సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనులు చేస్తున్నారు.

మింట్‌ కాంపౌండ్‌ వైపు ఉన్న డూమ్‌ పనులతో పాటు ఇతర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎలక్ట్రికల్, ఉడ్‌ వర్క్, పెయింటింగ్, ఫాల్‌ సీలింగ్‌ తదితర పనులు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పేరుకుపోతున్న చెక్క, ఫోమ్, థర్మకోల్‌ తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉంది. కాగా శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం వెనుక వైపు లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వెల్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. అయితే అకస్మాత్తుగా ఆ వైర్లలో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో  మంటలు మొదలయ్యాయి. క్షణాల్లోనే అక్కడున్న వ్యర్థాలకు అంటుకుని వ్యాపించాయి. ఈ పరిణామంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పరుగులు తీశారు. థర్మకోల్‌ వ్యర్థాలకు మంటలు అంటుకోవడంతో నల్లని పొగలు పెద్ద ఎత్తున కమ్ముకున్నాయి. లోయర్‌ గ్రౌండ్‌తో పాటు గ్రౌండ్, ఫస్ట్, సెకండ్‌ ఫ్లోర్ల వరకు వ్యాపించాయి. ఓ డోమ్‌ కూడా నల్లగా మారింది.  

సీఎంవో ఉన్న భవనంలోనే.. 
ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న 11 అగ్నిమాపక శకటాలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మంటలు పూర్తిగా ఆరిపోయాయి. మంటలు చెలరేగిన భవనం ఆరో అంతస్తులోనే సీఎం కార్యాలయం సిద్ధమవుతోంది. ఈ భారీ భవన నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం, అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. భవనం తుది మెరుగుల్లో ఉండటంతో ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే భారీయెత్తున సచివాలయం నిర్మాణమవుతున్నా.. ఫైర్‌ ఇంజన్‌ను సమీపంలో అందుబాటులో ఉంచకపోవడం విమర్శలకు తావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భవన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, అగ్నిప్రమాదంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ప్రమాద కారణాలను, ఇతర వివరాలను బయటకు రానీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు వెల్లడించేందుకు విముఖత చూపుతున్నారు. ఓ దశలో ఇదో మాక్‌డ్రిల్‌ అంటూ నమ్మించడానికి ప్రయత్నించారు. మింట్‌ కాంపౌండ్‌ రోడ్డులో పనులు జరుగుతుండటం, సచివాలయం వెనుక వైపు రోడ్లపై నిర్మాణ సామాగ్రి ఉండటం, ఎక్కడికక్కడ తవ్వకాల వల్ల ఫైర్‌ ఇంజన్లు లోపలికి, వెనుక వైపునకు వెళ్లడం కష్టసా«ధ్యమైంది. ఫైర్‌ సరీ్వసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ వై.నాగిరెడ్డి తెల్లవారుజామునే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మింట్‌ కాంపౌండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ఎవరినీ సచివాలయం సమీపానికి అనుమతించలేదు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top