ఎరువు.. ధరల దరువు | Fertilizer Prices increased in Telangana | Sakshi
Sakshi News home page

ఎరువు.. ధరల దరువు

Jun 5 2026 6:16 AM | Updated on Jun 5 2026 6:16 AM

Fertilizer Prices increased in Telangana

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో పెరిగిన ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు 

దీంతో ఆయా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు రూ.100 నుంచి రూ. 500 వరకు పెంపు 

యూరియా, డీఏపీ ధరలు యథాతథం

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభానికి ముందే రైతులకు ఎరువుల ధరల రూపంలో భారీ షాక్‌ తగిలింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరల పెరుగుదల నేపథ్యంలో కాంప్లెక్స్‌ ఎరువుల గరిష్ట చిల్లర ధరలను (ఎంఆర్‌పీ) ఎరువుల కంపెనీలు భారీగా పెంచాయి.

రాష్ట్రంలో ఈ నెల నుంచే ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్‌ తదితర పంటలు సాగు చేసే రైతులపై అదనపు భారం పడనుంది. ఈ పంటల్లో ప్రారంభ దశలోనే కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే విత్తనాలు, కూలీల వేతనాలు, పురుగు మందుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఎరువుల ధరల పెంపు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే యూరియా, డీఏపీ ధరలను కేంద్రం పెంచకపోవడం కొంత ఊరట. 

దిగుమతి భారం కావడంతో...
దేశంలో ఫాస్ఫేటిక్, పొటాషిక్‌ ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల్లో అధిక భాగం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడంతో రవాణా వ్యయాలు, దిగుమతి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ ప్రభావం కాంప్లెక్స్‌ ఎరువుల ధరలపై ప్రత్యక్షంగా పడింది. దీంతో సాగులో వినియోగించే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచారు. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ భారీగా పెంచింది.

ఎరువుల వ్యాపార వర్గాలు, వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం 20:20:0:13, 10:26:26, 17:17:17 వంటి కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెంచారు. ముఖ్యంగా ఫాస్ఫేటిక్, పొటాషిక్‌ ఎరువుల తయారీకి అవసరమైన రాక్‌ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్‌ యాసిడ్, అమోనియా, పొటాష్‌ వంటి ముడి పదార్థాలను భారత్‌ పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో కంపెనీలు ఎంఆర్‌పీలను సవరించినట్టు తెలుస్తోంది.

యూరియా ధర పెంచకపోవడం ఊరటే 
రైతులు అత్యధికంగా వినియోగించే యూరియా, డీఏపీ ధరలు యథాతథంగా ఉన్నాయి. యూరియా బస్తా రూ.266.50, డీఏపీ బస్తా రూ.1,350కే లభిస్తోంది. భారీ సబ్సిడీ కారణంగా ఈ ధరలను ప్రస్తుతం పెంచకుండా కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ భారం భరిస్తుండటంతో ఈ రెండు ఎరువుల ధరలను ప్రస్తుతం పెంచలేదు. దీంతో రైతులకు కొంత మేర ఊరట లభించినా, కాంప్లెక్స్‌ ఎరువుల ధరల పెరుగుదల మొత్తం సాగు వ్యయాన్ని పెంచనుంది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం తెలంగాణలో ఖరీఫ్‌ సీజన్‌లో లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగిస్తారు.

ఈ నేపథ్యంలో ధరల పెంపు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా రైతులపై పడే అవకాశం ఉంది. కాంప్లెక్స్‌ ఎరువులపై పడిన భారం కార ణంగా ఖరీఫ్‌ సాగు ఖర్చులు పెరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 20:20:0:13 బస్తాపై రూ.500 పెరిగితే వరి ఎకరానికి 3 బస్తాలు వాడితే రూ.1,500 అదనపు భారం కానుంది.పత్తి ఎకరానికి 3 బస్తాలు వాడితే రూ.1,500 అదనంగా భరించాల్సి వస్తుంది. అయితే రాష్ట్రంలో వరి, పత్తి, సోయాబీన్, మొక్క జొన్న, కూరగాయల పంటలకు కాంప్లెక్స్‌ ఎరువులతో పాటు యూరియాను కూడా అధికంగానే వినియోగించడం పరిపాటిగా మారింది.  

Advertisement
 
Advertisement
Advertisement