
ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం నాన్న.. తాను కొవ్వొత్తిలా కరుగుతూ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహరి్నషలు కష్టపడే శ్రామికుడు నాన్న.. జీవన ప్రయాణంలో తన స్వార్థం కోసం చూసుకోకుండా.. బిడ్డలను ఒడ్డున చేర్చేందుకు పరితపించే నావికుడు నాన్న.. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే తపనతో.. చివరి శ్వాస వరకూ రక్తమాంసాలను కరిగించే యోధుడు నాన్న.. ఎన్ని జన్మలైనా.. ఎంత సేవ చేసినా తీర్చుకోలేని రుణం నాన్న.. అందుకే నాన్నా.. మీరే మా హీరో. ఆదివారం జాతీయ పితృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..
‘సెవెన్ స్టార్’ బిచ్చన్న
కొడంగల్ రూరల్: పట్టణానికి చెందిన బిచ్చన్న – విజయలక్ష్మి దంపతులకు ఏడుగురు సంతానం. దర్జీ వృత్తి చేస్తూ పిల్లలను చదివించారు. ఆ కాలంలో ఏడుగురిని చదివించడమంటే ఆషామాషీ కాదు.. కానీ బిచ్చన్న బెదరలేదు.. పేదరికాన్ని జయించి కొడుకులను ఉన్నత స్థానంలో నిలిపారు. మొదటి కుమారుడు సత్యకుమార్ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ, ఐఐసీటీ.., సౌత్‌ఆఫ్రికాలో పోస్టు డాక్ చేశారు.
ప్రస్తుతం మస్కట్ దేశంలో యూనివర్సిటీ ఆఫ్ నిజ్వాలో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ రీసర్చ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్ ఐఐటీ బాంబే, ఎంఎస్‌సీ గణితం పూర్తి చేసి ప్రస్తుతం మస్కట్ దేశంలో హలీ బ్యాంకులో పని చేస్తున్నారు. మూడో కుమారుడు రవికుమార్ దౌల్తాబాద్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. నాల్గో కుమారుడు అనిల్‌కుమార్ మద్రాస్ ఐఐటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రస్తుతం కెనడియన్ కంపెనీలో రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వాటర్ టెక్నాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.
ఐదో కుమారుడు శివకుమార్ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ ప్రముఖ నగల దుకాణంలో సీనియర్ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. ఆరో కుమారుడు మనోజ్‌కుమార్ ఐఐఐటీ పూర్తి చేసి ఫీడెక్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా రాణిస్తున్నారు. ఏడో కుమారుడు నవీన్‌కుమార్ పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్‌సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసి అపెక్స్ కోవంటెజ్ ఎల్‌ఎల్‌సా, యూఎస్ కంపెనీలో డాటా ప్రోగ్రామర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలందరూ ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో బిచ్చన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు.