
కుమార్తెకు వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య
కూసుమంచి: రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మరణించగా, అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమార్తె ప్రాణం ఉన్నా మంచంలోనే అచేతన స్థితిలో మిగిలింది. దీంతో కూతురిని దక్కించుకోవాలని ఆ తండ్రి శక్తికి మించి రూ.లక్షల్లో అప్పులు చేసినా ఫలితం లేక బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఇది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన జర్పుల పరశురాం (46)– లలితకు సందీప్, సింధు సంతానం. పరశురాం భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం సింధు ఖమ్మంలో ఎంసెట్ పరీక్ష రాసింది.
పరీక్ష ముగిశాక ఆమెను సోదరుడు సందీప్ బైక్‌పై తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో సింధు తలకు తీవ్రగాయాలు కావడంతో మాటలేక అచేతన స్థితిలో ఉండిపోయింది. వీరి కుటుంబ దీనస్థితిని గమనించి దాతలు రూ.25 లక్షల మేర సాయం చేశారు. సింధుకు చికిత్స చేయించినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఆపై పరశురాం పలువురి వద్ద రూ.15 లక్షల వరకు అప్పు తీసుకుని చికిత్స కొనసాగించినా ఫలితం లేకపోయింది. తమకున్న పది గుంటల భూమిని అమ్ముకుందామంటే పట్టాదారు పాసుపుస్తకం లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది.
మంచంలో బిడ్డను చూడలేకపోతున్నా..
దాతల చేయూతకు తోడు అప్పులు చేసినా బిడ్డకు నయం కాకపోవడం, భూమి అమ్మలేని పరిస్థితి ఎదురుకావడంతో పరశురాం కుమిలిపోయాడు. దీంతో ఆదివారం రాత్రి తాను కౌలుకు తీసుకున్న చేను వద్దకు వెళ్లి అక్కడి నుంచి భార్య లలితకు ఫోన్ చేశాడు. కుమార్తెకు చికిత్స చేయించేందుకు తన శక్తి సరిపోవడం లేదని, బిడ్డను ఆ స్థితిలో చూడలేకపోతున్నానని ఆమెకు చెబుతూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. దీంతో లలిత స్థానికులతో కలిసి చేను వద్దకు వెళ్లి వ్యవసాయ బావిలో పరిశీలించగా పరశురాం మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.