సంక్రాంతి పండుగ వస్తోందంటే.. బడులు, కాలేజీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం సాధారణమే..! సహజంగా అమ్మాయిలు పొంగల్, రథం, సంక్రాంతి గాలిపటాలు, హరిదాసుతో కూడిన రంగోళీలతో అలరించడం తెలిసిందే..! కానీ, ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది. గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో రంగోళీ పోటీలో వినూత్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అదేంటో తెలిస్తే.. మీరూ షాకవుతారు..! అందమైన రంగవల్లుల స్థానంలో చేతబడి ముగ్గులు వేస్తున్నారు కొందరు పిల్లలు. ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టినట్లుగా.. చేతబడి బొమ్మలు.. అదే వుడూలను ముగ్గులో పెడుతున్నారు.
ఇటీవల హైదరాబాద్ శివార్లలోని ఘట్‌కేసర్ మండల పరిధిలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ముగ్గుల పోటీ జరిగింది. అంతకు ముందురోజు ఓ కుర్రాడు ముగ్గుల పోటీకి పేరు ఇచ్చాడు. టీచర్లు ఆశ్చర్యంతో.. అదేంట్రా? అమ్మాయిలు కదా? ముగ్గులు వేసేది? అని ప్రశ్నిస్తే.. నేను కూడా ముగ్గు వేస్తాను అంటూ సమాధానమిచ్చాడు. సరేనని అవకాశమిస్తే.. పోటీరోజున సీరియస్‌గా ముగ్గు వేశాడు.
జడ్జిమెంట్‌కు టీచర్ల బృందం ఒక్కోముగ్గును పరిశీలిస్తూ.. ఆ కుర్రాడి ముగ్గు వద్దకు వచ్చి అవాక్కయ్యారు. కొందరైతే భయభ్రాంతులకు గురయ్యారు. కారణమేంటంటే.. అచ్చంగా క్షుద్ర పూజల్లో మాంత్రికులు వేసినట్లుగా ఆ కుర్రాడు చేతబడి ముగ్గు వేశాడు. అంతేకాదు..! ఆ ముగ్గు మధ్యలో ఓ చేతబడి బొమ్మను పెట్టి.. దాన్ని సూదులతో గుచ్చాడు. కంగారుపడ్డ టీచర్లు వెంటనే బకెట్ నీళ్లతో ఆ ముగ్గుని చెరిపివేయించారు. ఈ ఉదంతాన్ని మరవక ముందే.. తాజాగా.. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉండే ఓ కాలేజీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జూనియర్ ఇంటర్ చదివే ఓ అమ్మాయి రంగోళీ పోటీలో ఇదేవిధంగా చేతబడి ముగ్గు వేసి.. భయభ్రాంతులకు గురిచేసింది. ఇక వికారాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు అక్కడి టీచర్లు ‘సాక్షి డిజిటల్’కు తెలిపారు.
ఈ ఉదంతాలను గురించి వింటుంటే మీకేమనిపిస్తోంది? పిల్లల్లో చేతబడిపై ఆసక్తి పెరుగుతోందా? లేక.. ఈ మధ్యకాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా మూఢనమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారా? ఈ ప్రశ్నలకు సైకాలజిస్టులు అనేక కారణాలను చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్విరాన్‌మెంట్.. అంటే.. చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం పిల్లలపై చాలా సులభంగా పడుతుందంటున్నారు. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో చేతబడి సీన్లు ఎక్కువగా ఉండడంతో.. అనుకున్నది సాధించాలంటే.. ఇదొక్కటే షార్ట్‌కట్ అనే భావన పిల్లల్లో త్వరగా వస్తుందని వివరిస్తున్నారు. అంతేకాదు.. సినిమాల్లో మంచి కంటే.. చెడు అనేది చాలా త్వరగా పిల్లల్లో నాటుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని సినిమాల్లో మంత్రగాళ్లు చదివే చేతబడి మంత్రాలను పిల్లలు వల్లెవేయడం వంటి కేసులు తమ వద్దకు వచ్చాయని చెబుతున్నారు.
ఇక పేరెంటింగ్ నిపుణులు, స్కూల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు సైతం తప్పు తల్లిదండ్రులదేనని చెబుతున్నారు. పిల్లలను సరిగ్గా పర్యవేక్షించకుండా తమ పనుల్లో బిజీ అవుతున్నారని, చిన్నారులు ఏంచేస్తున్నారో చూసే తీరిక కూడా వారికి ఉండడం లేదని పేర్కొంటున్నారు. నిత్యం మొబైల్ గేమ్స్ ఆడుతూ.. రీల్స్ చూడడంలో బిజీగా మారిపోతున్న చిన్నారులు క్రమంగా ప్రతికూలాంశాలు ఎక్కువగా ఉండే యాప్స్, మంత్రసాధన సంబంధిత యాప్స్‌వైపు మొగ్గుచూపుతున్నట్లు వివరిస్తున్నారు. పిల్లలు ఇలా తయారవ్వడానికి ముమ్మాటికీ తల్లిదండ్రుల పర్యవేక్షణలోపమే కారణమంటున్నారు.


