వారికి రైతుబంధు రానట్టేనా?

Farmers Worried About Rythu Bandhu Funds In Yadadri District - Sakshi

సీసీఎల్‌ఏ నుంచి రాని సమాచారం  

నిలిచిపోయిన బ్యాంకు ఖాతాల వివరాల నమోదు

సమాచారం వస్తదా, రాదా తెలియని పరిస్థితి 

నూతన పాస్‌బుక్‌లు పొందిన రైతులు ఎనిమిది వేల మందికి పైనే

దరఖాస్తు చేసుకున్న వారు 5,495  

సాక్షి, యాదాద్రి : కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులకు ఈసారి రైతుబంధు సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వ్యవసాయ శాఖ ముఖ్య కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నుంచి వచ్చిన డేటాలో వారి వివరాలు లేవు. యాసంగిలో పెట్టుబడి సాయం వస్తుందని ఆశపడ్డ కొత్త రైతులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. కొత్తగా పాస్‌ పుస్తకాలు తీసుకున్న రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 8 వేలకు పైనే ఉన్నారు.  

5,495 మంది దరఖాస్తు
రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత వివిధ రకాల సాంకేతిక సమస్యల వల్ల వేలాది మంది రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు రాలేదు. ఇటీవల సమస్యలను పరిష్కరించడంతో జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 8 వేల మందికి పైగా రైతులు కొత్త పాస్‌ పుస్తకాలు పొందారు. వీరిలో 5,495 మంది రైతుబంధు సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరైన ప్రచారం లేకపోవడం, అవగాహన లేమితో ఇంకా 2,500 మందికి పైగా దరఖాస్తు చేయలేదు. 2022 డిసెంబర్‌ 20లోపు నూతన పట్టాదారు పాస్‌ పుస్తకాలు వచ్చిన వారు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రకటించారు.దరఖాస్తు చేసుకున్న రైతులు రైతుబంధు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 

నిరాశలో రైతులు
వానాకాలం సీజన్‌లో రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యింది. యాసంగిలోనూ అదే విధంగా వస్తుందని కొత్త పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు ఆశపడ్డారు. కానీ, సీసీఎల్‌ఏ నుంచి సమాచారం రా కపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. బ్యాంకు పాస్‌ పుస్తకం నంబర్‌ను ఎంట్రీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ çవెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదని అధికారులు చెబుతున్నారు.

వివరాలు పంపని సీసీఎల్‌ఏ 
నూతనంగా పట్టదారు పాస్‌ పుస్తకాలు తీసుకున్న రైతుల వివరాలను సీసీఎల్‌ఏ వ్యవసాయశాఖకు పంపించలేదు. దీంతో వ్యవసాయ శాఖ కమిషనర్‌ వెబ్‌సైట్‌లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు లేవు. గతంలో మాదిరిగానే రకరకాల సాంకేతిక సమస్యలు చూపుతోంది. నూతన పాస్‌ బుక్‌ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, విస్తీర్ణం వివరాలను సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఏఈఓలు రైతుల బ్యాంకు పాస్‌పుస్తకం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత రైతుబంధు సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.కానీ, వెబ్‌సైట్‌లో వారి వివరాలు చూపడం లేదు.

డేటా వస్తే జమ చేస్తాం
కొత్తగా పాస్‌ పుస్తకాలు పొందిన వారి డేటా సీసీఎల్‌ఏ నుంచి మాకు రాలేదు. డేటాలో పట్టాదారు పాస్‌ బుక్‌ నంబర్, రైతు పేరు ఉంటుంది. ఈ వివరాలు సీసీఎల్‌ఏ నుంచి మాకు వస్తేనే నిర్ణీత ఫార్మాట్‌లో రైతుల బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ అప్‌లోడ్‌ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం. గత సీజన్‌లలో కొత్తగా పాస్‌ పుస్తకాలు పొందిన వారికి వెంటనే రైతుబంధు సహాయం అందింది. మాకు డేటా రాగానే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తాం.
–అనురాధ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top