
వర్షాలు కురవడంతో ఆదిలాబాద్ జిల్లాలో సాగుపనుల్లో నిమగ్నమైన రైతు
రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకున్న సాగు
సాక్షి, హైదరాబాద్: రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయం ఊపందుకుంది. ఇప్పటికే పత్తి సాగులో రైతులు బిజీగా ఉండగా, వర్షాల రాకతో వరిసాగు పెరుగుతోంది. చాలా జిల్లాల్లో బావులు, బోర్లు కింద ఇప్పటికే నారుమళ్లు పోశారు. కొన్ని జిల్లాల్లో నాట్లు ప్రారంభం కాగా, మరికొన్ని ప్రాంతాల్లో నాట్లేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు దుక్కులు దున్నుతూ సేద్యానికి సిద్ధమవుతున్నారు.
నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే రైతులు నారుమళ్లు పోసి.. వరి నాట్లేసే కార్యక్రమాలు ప్రారంభించారు. మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో వరిసాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ అధికారులు తగిన సూచనలు, సలహాలతో పంటల సాగును పర్యవేక్షిస్తున్నారు.
నిజామాబాద్‌లో లక్షన్నర ఎకరాల్లో ఇప్పటికే సాగు
నిజామాబాద్‌లో ఇప్పటికే లక్షన్నర ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. కామారెడ్డిలో 27 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, జనగాంలో 15వేల ఎకరాల్లో సాగైంది. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ వారాంతానికి బోర్లు, బావులతోపాటు చెరువులు, కుంటల కింద కూడా నార్లు పోస్తారని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, దిగువ మానేరుతో పాటు దేవాదుల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల కింద నీటి లభ్యతను బట్టి వరిసాగు చేస్తారని తెలిపారు.
పత్తి, మొక్కజొన్నకు జీవం
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల మెట్టభూముల్లో సాగైన పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసినట్టయ్యింది. నెలరోజుల క్రితం నుంచే పత్తి సాగు మొదలు కాగా, జూన్ మొదటి వారం నుంచే వరుణుడు మొహం చాటేయడంతో రైతులు ఆందోళన చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పత్తి మొలకెత్తలేదు. కొన్నిచోట్ల మొలకలు వచ్చినా, నీరు లేక ఎండిపోయాయి. కరీంనగర్, మెదక్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా వర్షాలు లేక పత్తి రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 43.47 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, అందులో పత్తి 31 లక్షల ఎకరాల్లో సాగయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే పత్తి అధికంగా సాగయ్యే ఆదిలాబాద్‌లో వాతావరణం కొంత అనుకూలంగా ఉండటంతో రైతులకు ఊరటనిచ్చింది. ఇదే జిల్లాలో సోయాబీన్, కంది కూడా ఎక్కువగానే సాగు చేశారు. ఈ వర్షాలతో ఆదిలాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
కూరగాయల సాగుకు ఊతం
రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కూరగాయల సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈసారి కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుందని ఉద్యానవనశాఖ అంచనా వేస్తుంది.