‘పంట’ మారితేనే సాగు.. బాగు | Farmer Welfare Commission Holds Meeting On Crop Rotation And Future Plans | Sakshi
Sakshi News home page

‘పంట’ మారితేనే సాగు.. బాగు

Jun 7 2026 5:25 AM | Updated on Jun 7 2026 5:25 AM

Farmer Welfare Commission Holds Meeting On Crop Rotation And Future Plans

ప్రభుత్వానికి రైతు సంక్షేమ కమిషన్‌ నివేదిక

లేకుంటే నేల నిస్సారమై గడ్డి కూడా మొలవదు

పర్యావరణపరంగా, ఆర్థికంగానూ తీవ్ర నష్టం 

పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి 

పంటల మార్పిడితోనే వ్యవసాయానికి భవిష్యత్తు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరి, పత్తి పంటల ఉచ్చు నుంచి బయటపడకపోతేభవిష్యత్తులో వ్యవసాయం ప్రమాదకరంగా మారనుందా..? అవుననే అంటోంది రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్‌. వరి, పత్తి పంటలనే నమ్ముకుంటే దీర్ఘకాలంలో అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఆర్థికంగా, పర్యావరణపరంగా తీవ్ర నష్టమని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యవసాయాన్ని వరి, పత్తి ఆధారిత వ్యవస్థ నుంచి అధిక ఆదాయం, తక్కువ నీటి వినియోగం, మెరుగైన పర్యావరణ సమతుల్యత కలిగిన వైవిధ్యభరిత వ్యవసాయ విధానంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పింది.

సుస్థిర వ్యవసాయం, రైతుల ఆదాయ భద్రత, సహజ వనరుల పరిరక్షణ కోసం పంటల మార్పిడి తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ మేరకు రైతు కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి నేతృత్వంలో రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. వరి, పత్తికి విని యోగిస్తున్న ఎరువులు నేలతల్లిని నిస్సారంగా మారుస్తున్నాయని నివేదిక పేర్కొంది. మరికొన్నాళ్లు అదే పరిస్థితి కొనసాగితే ఆ భూముల్లో గడ్డి మొలవడం కూడా కష్టమేనని వెల్లడించింది. 2013–14లో ఉన్న పంటల సాగు 2024–25 నాటికి పూర్తిగా మారిపోయిందని చెప్పింది. ముఖ్యంగా వరి, పత్తి సాగును క్రమంగా తగ్గించి ఉద్యానవన పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సూచించింది. ఈ మేరకు రూపొందించిన ‘పంటల మార్పిడి’నివేదికను శనివారం విడుదల చేశారు.  

వరి, పత్తిని సర్కారే సేకరిస్తుండటంతో... 
వరి, పత్తికి మాత్రమే కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోళ్ల భరోసా ఉండటంతో రైతులు ఏకపంట సాగు వైపు మొగ్గుచూపుతున్నారని కమిషన్‌ పేర్కొంది. దీనివల్ల భూసారం క్షీణించడం, నీటి వినియోగం పెరగడం, ఎరువులు, పురుగుమందుల వినియోగం అధికమవడం, పంటల వైవిధ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం వరి, పత్తి కొనుగోళ్లను పరిమితం చేసే అవకాశం కూడా ఉండటంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కమిషన్‌ సూచించింది. వానాకాలం, యాసంగి సీజన్‌లు కలిపి ఏటా 1.30 కోట్ల ఎకరాల్లో వరి సాగయ్యే పరిస్థితి ఏర్పడింది. పత్తికి కూలీల సమస్య ఉన్నప్పటికీ, పురుగు మందులను వినియోగిస్తే అధిక పంటతో గిట్టుబాటు కలుగుతుందనే భావనతో రైతులు వరి తరువాత పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు.  

ఉద్యాన పంటలకు అడ్డంకులు 
ఉద్యాన పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నప్పటికీ రైతులకు అధిక ఆదాయం అందిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ మార్కెటింగ్‌ సదుపాయాల కొరత, ధరల అనిశ్చితి, కోల్డ్‌ స్టోరేజీలు లేకపోవడం, ప్రాసెసింగ్‌ యూనిట్ల కొరత రైతులను ఉద్యాన పంటల నుంచి దూరం చేస్తున్నట్లు వివరించింది. వీటికి తోడు ఇటీవలి కాలంలో అధికమైన కోతులు, అడవి పందులు, జింకల బెడద రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తోటలపై వన్యప్రాణుల దాడులు పెరగడంతో రైతులు ఉద్యాన పంటల నుంచి దూరమవుతున్నారని కమిషన్‌ గుర్తించింది.

ఈ సమస్యకు పరిష్కారంగా నాబార్డు సహకారంతో సోలార్‌ ఫెన్సింగ్‌కు సబ్సిడీ ఇవ్వాలని సూచించింది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాలను ‘వెజిటబుల్‌ జోన్‌’లుగా ప్రకటించి హైదరాబాద్‌ మార్కెట్‌ అవసరాలను స్థానికంగా తీర్చాలని ప్రతిపాదించింది. ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’విధానాన్ని అమలు చేసి, ఆయా జిల్లాల్లో ప్రత్యేక పంటలకు ప్రోత్సాహకాలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్ల తోటలు, పూల సాగు, ఆయిల్‌ పామ్, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కమిషన్‌ సూచించింది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), పంట కాలనీలు, ఫుడ్‌ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తేనే పంటల మార్పిడి విజయవంతమవుతుందని నివేదిక స్పష్టం చేసింది.  

రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం తీరు ఇలా (విస్తీర్ణం ఎకరాల్లో)... 
పంట         2013–14         2024–25  
వరి        49,28,000        1,27,03,000 
పత్తి        15,00,000        45,00,000 
పండ్ల తోటలు     9,11,200         4,48,960     
కూరగాయలు    5,52,352        1,02,698     
పూల తోటలు    17,220            6,248  
ఆయిల్‌పామ్‌    33,742            2,43,498     
పసుపు        1,52,445        42,246 
పప్పుధాన్యాలు    10,20,418        8,83,710     
నూనెగింజలు    12,41,845        7,13,572 
చిరుధాన్యాలు    19,58,378        18,84,528 
మొత్తం ఉద్యాన పంటలు    19,82,270    12,46,032 

Advertisement
 
Advertisement
Advertisement