పాజిటివ్‌గా తేలడంతో దారుణానికి పాల్పడ్డ రైతు

Farmer Life Assassinated After Tests Corona Virus Positive In Vikarabad - Sakshi

నాగసమందర్‌లో ఘటన

సాక్షి, ధారూరు(వికారాబాద్‌): కరోనా పాజిటివ్‌ అని తేలడంతో భయపడిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ధారూరు మండలం నాగసమందర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సురేష్, గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నాగసమందర్‌కు చెందిన ముతికె శాంత్‌కుమార్‌(54) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయన మూడు రోజులుగా దగ్గు, దమ్ము, జ్వరంతో బాధపడుతున్నాడు. సోమవారం ఉదయం తాండూరులోని జిల్లా అస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది.

దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఇంటికి వచ్చి దులానికి ఉరివేసుకునే ప్రయత్నం చేశాడు. ఇది గుర్తించిన కుటుంబీకులు, గ్రామస్తులు అడ్డుకుని, నచ్చజెప్పారు.  అందరినీ నమ్మించిన ఆయన సాయంత్రం వేళ భార్య నాగవేణి(50)ని నీళ్లు తీసుకురమ్మని ఇంట్లో నుంచి పంపించి దులానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన భార్య గుండెలు బాధుకుంటూ ఇతరుల సహాయంతో కిందకు దింపి చూడగా అప్పటికే శాంత్‌కుమార్‌ మరణించాడు.

మృతుడి కుమారుడు భీమలింగం పోలసులకు  ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ సురేష్‌ సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలానికి డాక్టర్‌ను పిలిపించి పోస్టు మార్టమ్‌ చేయించారు. కోవిడ్‌ నిబంధనల మేరకు అంత్యక్రియలు జరిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. మృతుడికి భార్యతో పాటు కొడుకులు శివశంకర్, భీమలింగ్‌లు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని జవనం గడుపుతున్న శాంతుకుమార్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top