ఫ్యాన్సీ క్రేజ్‌! అంకెల్లోనే అదృష్టముందని.. | Fancy Craze In RTA Special Number Bidding Hyderabad | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ క్రేజ్‌! అంకెల్లోనే అదృష్టముందని..

Jun 13 2026 8:08 AM | Updated on Jun 13 2026 8:08 AM

Fancy Craze In RTA Special Number Bidding Hyderabad

నచ్చిన నంబర్‌ కోసం రూ.లక్షలకూ వెనకాడట్లే..

అదృష్ట సంఖ్యలకూ మస్తు డిమాండ్‌

ఎక్కువ మంది పోటీలో నిలిచేలా చర్యలు

బిడ్డింగ్‌ గడువును పెంచిన రవాణా శాఖ

సాక్షి, సిటీబ్యూరో: ‘టీజీ 09 జీ 9999’ రూ.25.50 లక్షలు.. గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన ఆర్టీఏ ప్రత్యేక నంబర్ల  బిడ్డింగ్‌లో ఆల్‌ నైన్స్‌ కోసం ఓ ప్రైవేట్‌ సంస్థ చెల్లించిన మొత్తం ఇది. నవంబర్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో ‘టీజీ 09హెచ్‌ 9999’ కోసం ఓ వాహన యజమాని రూ.22.72 లక్షలు  చెల్లించారు. అదే ఆల్‌నైన్స్‌ కోసం గత జనవరి 6న ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో మరో సంస్థ రూ.18 లక్షలతో  నంబర్‌ను సొంతం చేసుకుంది. ఒక్క ఆల్‌నైన్స్‌ మాత్రమే కాదు. అన్ని రకాల ప్రత్యేక నంబర్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ‘టీజీ 09 హెచ్‌ 0234’ నంబర్‌ కోసం ఓ వాహన యజమాని రూ.1.01 లక్షలు  చెల్లించారు. అదృష్ట సంఖ్యలుగా భావించే నచ్చిన నంబర్‌ల కోసం వాహనదారులు రూ.లక్షలు చెల్లిస్తున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రవాణా శాఖ మూడు నెలలకోసారి నిర్వహించే ప్రత్యేక నంబర్‌ల బిడ్డింగ్‌ కోసం ఏటా భారీ డిమాండ్‌ నెలకొంటోంది. ఖరీదైన కార్లతో పాటు ద్విచక్ర వాహనాలకూ ప్రత్యేక నంబర్‌ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫీజుల రూపంలో, బిడ్డింగ్‌ ద్వారా రవాణా శాఖకు ఏటా దాదాపు రూ.100 కోట్ల వరకు ఆదాయం లభిస్తున్నట్లు అంచనా. వాహనదారుల క్రేజ్‌ను, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని తాజాగా ప్రత్యేక నంబర్‌ల బిడ్డింగ్‌ గడువును 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచారు. సాధారణంగా కొత్త వాహనాల  తాత్కాలిక రిజి్రస్టేషన్‌ గడువు 30 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ గడువు లోపల మాత్రమే నచ్చిన నబర్‌ల కోసం పోటీ పడాల్సి ఉంటుంది. తాజాగా చేసిన సవరణ మేరకు వాహనదారులు  60 రోజుల వరకు పోటీలో పాల్గొనే వెసులుబాటు లభించింది.

అంకెల్లోనే అదృష్టముందని..   
సాధారణంగా కొన్ని రకాల నంబర్‌లను వాహనదారులు అదృష్ట సంఖ్యలుగా భావిస్తారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ‘9’ నంబర్‌ను అదృష్టంగా భావించి దానికే ప్రాధాన్యమిచ్చేవారు. దీంతో అప్పటి వరకు ఎలాంటి డిమాండ్‌ లేని ‘9’ నంబర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌  వచ్చింది. అలా సింగిల్‌ నైన్, ట్రిపుల్‌ నైన్, ఆల్‌నైన్‌ నంబర్‌లు క్రేజ్‌గా మారాయి. రైజింగ్‌ నంబర్‌లను కూడా చాలా మంది అదృష్టంగా పరిగణిస్తారు. ‘1234’, ‘5678’ వంటి వాటికి   డిమాండ్‌ ఉంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘6’ను అదృష్టసంఖ్యగా భావించారు. దీంతో ఆయన వాహనాలకు ఆ నంబర్‌లనే ఏర్పాటు చేశారు. క్రమంగా వాహనదారుల్లో  ‘6’ తో మొదలై ‘ఆల్‌ సిక్స్‌’ వరకు క్రేజ్‌ పెరిగింది. సినీనటులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తమ వాహనాలకు నచ్చిన నంబర్‌లను ఏర్పాటు చేసుకోవడం సంప్రదాయంగా మారింది.

బహుమతులుగానూ..  
ప్రత్యేక నంబర్‌లను బహుమతులుగా అందజేసే  ఆనవాయితీ కూడా పెరిగింది. పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటిప్రత్యేక సందర్భాల్లో కొత్త వాహనాలతో పాటు, ప్రత్యేక నంబర్‌లు సైతం కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు  బహుమతులుగా అందజేయడం విశేషం. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ ఈ నంబర్‌ల ఫీజును సైతం  గతేడాది భారీగా పెంచింది. ‘ఆల్‌ నైన్స్‌’ కోసం రూ.50,000  ఉన్న ఫీజును ఏకంగా రూ.1.5 లక్షల కు, ‘1, 9, 6666’ నంబర్‌లకు రూ.లక్ష వరకు ఫీజు పెంచింది. ‘99, 999, 3333, 5555’ వంటి నంబర్‌లకు రూ..50 వేలకు ఫీజు పెంచడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement