వంద రోజుల్లో అందరికీ కంటి పరీక్షలు 

Eye Tests for everyone in 100 days - Sakshi

ఇప్పటివరకు 70 లక్షల మందికిపైగా పూర్తి 

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి  

గజ్వేల్‌: వందరోజుల్లో అందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ – ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి పరీక్షల తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటివెలుగు శిబిరాల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 70 లక్షల పైచిలుకు మంది కంటి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. వారిలో 32 లక్షలమంది పురుషులు, 37 లక్షల పైచిలుకు మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో 48.91 లక్షల మందికి ఎలాంటి సమస్యల్లేవని తేలిందన్నారు.

కంటి సమస్యలు ఉన్న 12 లక్షల మందికి రీడింగ్‌ అద్దాలు ఇప్పటికే పంపిణీ చేయగా, మరో 8 లక్షల మందికి 15 రోజుల్లో డాక్టర్లు సూచించిన అద్దాలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 4,565 పంచాయతీలు, 1,616 మున్సిపల్‌ వార్డుల్లో శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందన్నారు. తనిఖీ సందర్భంగా శిబిరాల్లో మెరుగైన సేవలందుతున్నాయని మహిళలు చెప్పడం తనకు ఆనందాన్నిచ్చిందని మంత్రి చెప్పారు.

వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకీయొద్దీన్, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ మండల శాఖ అధ్యక్షులు బెండె మధు, గజ్వేల్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top