పంట నష్టం సర్వే గడువు పెంపు.. 33 శాతం నష్టం జరిగితేనే పరిగణలోకి | Sakshi
Sakshi News home page

పంట నష్టం సర్వే గడువు పెంపు.. 33 శాతం నష్టం జరిగితేనే పరిగణలోకి

Published Thu, May 4 2023 1:29 AM

Extension of crop damage survey deadline - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల వర్షాలు నిత్యం పడుతుండటం, రోజురోజుకూ పంట నష్టం పెరుగుతున్న నేపథ్యంలో దెబ్బతిన్న పంటల సర్వే గడువును రాష్ట్ర వ్యవసాయ శాఖ పొడిగించింది. ఈ నెల ఒకటో తేదీ వరకే సర్వే నివేదిక పంపించాలని తొలుత వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ నుంచి క్షేత్రస్థాయికి ఆదేశాలు ఇచ్చారు. అయితే రానున్న రోజుల్లో వడగళ్లు, మరిన్ని అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పంట నష్టం సర్వే గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించారు.

ఏఈవోలు పంటల వారీగా, సర్వే నంబర్లు, క్లస్టర్ల వారీగా పంట నష్టాన్ని అంచనా వేసి ఈనెల 12 వరకు ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేయాలని కమిషనర్‌ రఘునందన్‌ రావు ఆదేశాలు జారీచేశారు. సమాచారం మొత్తం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా మండలాలు, డివిజన్లు, జిల్లాలవారీగా పంట నష్టం వివరాలను పరిశీలించి మొత్తంగా జరిగిన నష్టం వివరాలను తేల్చనున్నారు.

33 శాతం నష్టం జరిగితేనే నమోదు..
పంట నష్టం వివరాలను 32 అంశాలతో ఏఈవోలు సేకరిస్తున్నారు. సంబంధిత క్లస్టర్‌లో నష్టపోయిన రైతుల పేర్లు, సర్వే నంబర్లు, సాగుచేసిన పంటల వివరాలు, బాధిత రైతుకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. పంట నష్టంపై అంచనాకు గతంలో చేసిన క్రాప్‌ బుకింగ్‌ పోర్టల్‌ లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఏ రైతు, ఏ సర్వే నంబరులో ఏ పంట వేశారనే వివరాలు క్రాప్‌ బుకింగ్‌లో నమోదై ఉంటేనే నష్టపరిహారం జాబితాలో రాస్తున్నారు. అలాగే 33 శాతానికి మించి పంట నష్టం జరిగితేనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. 

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం 
అకాల వర్షాలపై పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ సమీక్ష 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆ సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ హామీనిచ్చారు. అకాల వర్షాలపై ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై చైర్మన్‌ బుధవారం పౌరసరఫరాల భవన్‌లో అధికారులతో సమీక్షించారు.

ధాన్యం కొనుగోలు, తరలింపు, తడిచిన ధాన్యం, గన్నీ సంచులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు 1967, 180042 500333 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement