
వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ వెలువరించనున్న ఎస్‌ఈసీ
ఆ మరుసటి రోజే నోటిఫికేషన్
ఖరారైన రిజర్వేషన్లపై జీవో జారీకి కసరత్తు
ఎన్నికలకు నవంబర్ వరకు గడువు కోరనున్న సర్కార్!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన ప్రత్యేక జీవో..గురు లేదా శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ముందుగా విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమశాఖ లేదా ప్రణాళిక శాఖ జీవో జారీ చేస్తుందని సమాచారం. ఈ జీవో వచ్చాకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఈ రెండు జీవోలు వెంట వెంటనే వెలువడే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమని అధికారవర్గాల సమాచారం. కాగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి జీవో జారీ అయ్యి తమకు అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆగమేఘాలపై ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మరుసటిరోజు నోటిఫికేషన్‌ను విడుదల చేయొచ్చునని తెలుస్తోంది.
పీఆర్ శాఖ కసరత్తు ముమ్మరం
బుధవారం సచివాలయంలోని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి కార్యాలయంలో.. పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్, ఇతర అధికారులు ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్లకు అనుగుణంగా జీవో జారీకి కసరత్తు నిర్వహించినట్టు తెలిసింది. బుధవారంలోగా రిజర్వేషన్ల ఖరారు సమాచారాన్ని అందించాలంటూ కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ మేరకు అందిన సమాచారాన్ని అధికారులు క్రోడీకరించి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన రిజర్వేషన్ల ఖరారు చేసిన కసరత్తును బుధవారం సైతం సీఎస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షించారు.
ఎన్నికలు అసలు ఉంటాయా?
స్థానిక ఎన్నికలకు వివిధ శాఖల పరంగా సన్నాహాలు ముమ్మరంగా సాగుతుండగా.. మరోవైపు అసలు స్థానిక ఎన్నికలు ఉంటాయా? అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు 42 శాతం జీవో న్యాయస్థానాల్లో నిలబడకపోయినా, ఇతరత్రా ఆటంకాలు ఏవైనా ఎదురైనా ఎన్నికలు ఆగే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే ఈ నెలాఖరుకల్లా ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు జరుగుతున్న కసరత్తును, రిజర్వేషన్ల అంశాన్ని హైకోర్టుకు తెలియజేసి..ఎన్నికల నిర్వహణకు మరింత గడువు అంటే నవంబర్ ఆఖరులోగా నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతికోరే అవకాశం ఉందని అంటున్నారు.
రిజర్వేషన్ల ఖరారు ఇలా..
నూతన పీఆర్ చట్టానికి అసెంబ్లీ ఆమోదించిన సవరణలకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్‌పీటీసీలు, జెడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఇలా అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వ్ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో రిజర్వేషన్ సీట్లన్నీ కూడా ఎస్టీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా, మొత్తం సీట్లలో 50 శాతానికి తగ్గకుండా చేశారు.
ఈ ఏరియాల్లోని మండల అధ్యక్షుల పదవులన్నీ కూడా ఎస్టీలకే రిజర్వ్ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ రిజర్వేషన్ల ఖరారును పంచాయతీరాజ్ కమిషనర్, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ స్థానాలను జిల్లా కలెక్టర్లు, మండలాల్లో ఎంపీటీసీ రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా...బీసీ రిజర్వేషన్లను కులగణన (ఎస్‌ఈఈఈపీసీ) సర్వే 2024 ప్రకారం పూర్తి చేశారు.