
హైదరాబాద్: మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఈ నియోజకవర్గ పరిధిలో రాజకీయ సమీకరణలు మారనున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఆకుల రాజేందర్ 2009లో కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. బీసీ నేతగా ఎదిగి నియోజకవర్గ అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించారు. రెండోసారి కాంగ్రెస్ నుంచి టికెట్ లభించకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు.
కొంతకాలం తర్వాత పార్టీలో ఇమడలేక బహుజన్ సమాజ్ పార్టీలోకి వెళ్లారు. అనంతరం తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కానీ.. పార్టీలో సముచితమైన స్థానం, గుర్తింపు లభించకపోవడంతో స్తబ్ధుగా ఉండిపోయారు. కొద్ది కాలం క్రితం కాంగ్రెస్‌కు సైతం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడంతో మల్కాజిగిరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.
ఇక్కడ అధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, వివాద రహితుడిగా పేరు ఉండటంతో ఆయన చేరికతో బీజేపీ బలం పుంజుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే పదవీ కాలం పూర్తయినప్పటి నుంచి రాజకీయాలకు అంటీముట్టనట్లుగా ఉండటంతో ఆయన అనుచర గణాలు ఇతర పార్టీల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం ఆయన అనుయాయులు తిరిగి బీజేపీలోకి వస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.