
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం శనివారం కొత్త మలుపు తిరిగింది. సీఎం సిఫారసు మేరకు ఈటల నిర్వహిస్తున్న మం త్రిత్వ శాఖ బాధ్యతలను సీఎంకు బదలాయిస్తూ గవర్నర్ శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈమేరకు గెజిట్ జారీ చేశారు. దీంతో పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా ఈటల మిగి లారు.మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీం పేట, అచ్చంపేట గ్రామాల్లో ఈటల అసైన్డ్ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలతో రెండ్రోజు లుగా జరుగుతున్న పరిణామాలు ఈటల మంత్రి పదవిలో కొనసాగడం చుట్టూ తిరుగుతున్నాయి. సీఎస్, విజిలెన్స్ నివేదికలు అందిన తర్వాతే కేబి నెట్ నుంచి ఉద్వాసన పలుకుతారని భావించారు. అయితే విచారణ నివేదికలతో సంబంధం లేకుండానే ఈటల నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖను సీఎం తనకు బదలాయించుకోవడంతో టీఆర్‌ఎస్ అంతర్గత రాజకీయం రసవత్తరంగా మారింది.
మంత్రి పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ...
తాజా పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ మంత్రివర్గంలో కొనసాగడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈటలను నేరుగా కేబినెట్ నుంచి తొలగించకుండా ‘రాజీనామా నిర్ణయం’అనే బంతిని ఈటల కోర్టులోకి నెడుతూ శాఖల బదలాయింపు వ్యూహాన్ని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెరమీదకు తేచ్చారు. తద్వారా ‘ఆత్మగౌరవం, పనిచేసే స్వేచ్ఛ’వంటి అంశాలను ప్రస్తావిస్తూ సీఎంపై అసంతృప్త గళం విప్పిన ఈటలను మంత్రి పదవిలో కొనసాగే విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య స్థితిలోకి నెట్టారు. శరవేగంగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తున్న ఈటల తన రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి...
తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖను సీఎం బదిలీ చేసుకోవడంతో భవితవ్యంపై ఈటల మథనం ప్రారంభించారు. శనివారం హైదరాబాద్‌శివార్లలోని షామీర్‌పేటలో ఉన్న తన నివాసానికే పరిమితమైన ఈటల.. తాజా పరిణామాలను విశ్లేషిస్తూ కబ్జా విషయంలో తనపై వస్తున్న ఆరోపణల విషయమై మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. విచారణ నివేదిక తనకు వ్యతిరేకంగా ఉండబోతోందనే అంచనాకు వచ్చిన ఈటల.. శనివారం మధ్యాహ్నం కేసీఆర్ వ్యవహార శైలిపై తన అసంతృప్తిని తొలిసారిగా బహిరంగంగా వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను కలిశారు. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో సంయమనంతో వ్యవహరిద్దామని ఈటల వారికి నచ్చచెప్పారు.
పదవులన్నింటికీ రాజీనామా..?
తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను నియోజకవర్గ ప్రజలు, నాయకులతో చర్చించిన తర్వాతే ప్రకటించాలని ఈటల భావిస్తున్నారు. తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు పక్కా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారని పేర్కొన్న ఈటల.. రాబోయే రోజుల్లో కేవలం మంత్రి పదవికి రాజీనామా చేయాలా... చేస్తే ఎప్పుడు చేయాలి... ఎమ్మెల్యేగా కొనసాగాలా లేక ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా చేయాలా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. ‘హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు సంయమనం పాటించాలి. కరోనా సమయం కాబట్టి ఎవరూ హైదరాబాద్ రావద్దు. ఇబ్బందులు పడొద్దు’అని విజ్ఞప్తి చేసిన ఈటల.. ఒకట్రెండు రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గానికి వెళ్లి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కావాలని భావిస్తున్నారు. విచారణ నివేదిక అందిన తర్వాత చోటుచేసుకొనే పరిణామాల తర్వాతే మలి అడుగు వేయాలనే యోచనలో ఉన్నారు.