
హైదరాబాద్: అతి వేగం ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం ప్రగలపల్లి గ్రామానికి చెందిన బంటు రాజ్‌కుమార్(20), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన అటికెటి సిద్దార్ధ(21) ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు.
ఆదివారం రాత్రి వీరు ఓయూ హాస్టల్ నుంచి బైక్‌పై విద్యానగర్ వెళుతుండగా అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.