ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు మళ్లీ బ్రేక్‌ | Engineering counseling gets another break | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు మళ్లీ బ్రేక్‌

Jun 25 2025 6:06 AM | Updated on Jun 25 2025 6:06 AM

Engineering counseling gets another break

ఉన్నత విద్యామండలి వర్సెస్‌ సాంకేతిక విద్యామండలి 

రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం 

ఫీజులపై జీవో వచ్చేవరకు కౌన్సెలింగ్‌ వద్దన్న అధికారులు 

కొత్త సీట్లపై స్పష్టత ఇవ్వని ఏఐసీటీఈ  

న్యాయ సలహాలు తీసుకున్నాకే ముందుకు వెళ్లాలని సాంకేతిక విద్యామండలి నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యామండలి వర్సెస్‌ సాంకేతిక విద్యామండలి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌పై ఈ విభాగాల మధ్య అగాధం పెరుగుతోంది. ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇవ్వడానికి మొత్తం రంగం సిద్ధమైన తరుణంలో సాంకేతిక విద్యామండలి మోకాలొడ్డింది. ఇంజనీరింగ్‌ ఫీజులు ఖరారు కాకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించేది లేదంటూ కరాఖండీగా తేల్చిచెప్పినట్టు సమాచారం. 

వాస్తవానికి కిందిస్థాయి అధికారులు మంగళవారం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రభుత్వం కూడా అనుమతించిందని ఉన్నత విద్యామండలి అధికారులు చెప్పారు. అయితే ఈ సమాచారం బహిరంగపర్చడంపై విద్యాశాఖ, సాంకేతిక విద్య అధికారులు మండి పడుతున్నారు. తమను సంప్రదించకుండా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇస్తామన్న ప్రచారం సరికాదన్నారు. 

ఈ తరహా ప్రకటనలు చేయడంపై సాంకేతిక విద్యామండలి ఉన్నతాధికారి ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. అసలు షెడ్యూల్‌ ఇవ్వాల్సింది తామని సాంకేతిక విద్య ఉన్నతాధికారులు అంటున్నారు. అధికారుల సమన్వయ లోపం కారణంగా కౌన్సెలింగ్‌ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల నెలన్నర ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. 

అవునంటే.. కాదంటూ 
ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్, అనుబంధ గుర్తింపు, సీట్ల పెంపుపై యూనివర్సి టీల వీసీలు, ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యామండలి అధికారుల మధ్య ఏమాత్రం సమన్వయం కుదర డం లేదు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొత్తం యూనివర్సిటీలు పూర్తి చేశా యి. గుర్తింపు ఇవ్వడానికి సిద్ధమైన తరుణంలో విద్య, సాంకేతిక విద్య ఉన్నతాధికారులు దీనిపై అభ్యంతరాలు లేవనెత్తారు. 

కాలేజీలను పూర్తిగా తనిఖీ చేసేందుకు కమిటీ వేయాలంటూ సాంకేతిక విద్యామండలి ప్రభుత్వం వద్ద కొత్త వాదన లేవనెత్తింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నలివ్వడంతో అఫ్లియేషన్ల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. కౌన్సెలింగ్‌లో కాలేజీలు పాల్గొనాలంటే ముందు గుర్తింపు ఇవ్వాలి. ఇంత వరకూ కమిటీ ఏర్పాటుకు మార్గదర్శకాలు రాలేదు. అప్పటి వరకూ గుర్తింపు ఇవ్వకుండా ఆపడం ఏమిటని వీసీలు అంటున్నారు. 

ఉన్నతాధికారులు వ్యక్తిగత ప్రతిష్టకు పోతున్నారని, వీసీలపై పెత్తనం చెలాయించే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఓ యూనివర్సిటీ వీసీ అన్నారు. ఫీజుల వ్యవహారంపైనా ఇదే పేచీ కొనసాగుతోంది. ప్రైవేట్‌ కాలేజీల ఆడిట్‌ నివేదికలు పరిశీలించిన ఎఫ్‌ఆర్‌సీ తుది నివేదికను ప్రభుత్వానికి పంపింది. 

ఫీజులు ఖరారైనట్టు ఉన్నత విద్యామండలి వెల్లడించడంతో సాంకేతిక విద్యామండలి అధికారులకు ఆగ్రహం వచ్చింది. అసలు ఫీజులు ఎలా పెంచుతారంటూ సాంకేతిక విద్య అధికారి ఒకరు అభ్యంతరం లేవనెత్తారు. ఈ వివాదాన్ని ప్రభుత్వం వరకూ చేరవేశారు. దీంతో ఫీజుల ఖరారు ఆగిపోయింది.  

జీవో రాకుండా కౌన్సెలింగ్‌ కుదరదు 
ఫీజులపై ప్రభుత్వం జీవో ఇవ్వాలని సాంకేతిక విద్యామండలి అధికారులు అంటున్నారు. అప్పటి దాకా కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని చెబుతున్నారు. అయితే, ఉన్నత విద్యామండలి మాత్రం ఫీజుల వ్యవహారంతో పనిలేకుండానే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. ఒకవేళ ఫీజులు పెంచితే ఆ తర్వాత కాలేజీలు వసూలు చేసుకోవచ్చనే షరతును కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో పెడతామని తెలిపింది. 

ఫీజుల వ్యవహారంపై ప్రైవేట్‌ కాలేజీలు కోర్టుకెళ్లే ఆలోచనలో ఉన్నాయి. ఇదే జరిగితే జీవో ఇవ్వకుండా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని సాంకేతిక విద్యామండలి అధికారులు అంటున్నారు. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ నెలాఖరు వరకూ కొత్త సీట్లపై స్పష్టత ఇస్తుంది. కొత్త సీట్ల వ్యవహారం తేలకుండా రాష్ట్ర కౌన్సెలింగ్‌ నిర్వహించడం సరికాదని విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. 

ఒకవేళ కొత్త సీట్ల పెంపు అనివార్యమైతే ఆఖరి కౌన్సెలింగ్‌లో వీటిని పొందుపరిస్తే సరిపోతుందని ఉన్నత విద్యామండలి అంటోంది. ఇలా భిన్న వాదనల మధ్య కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వాయిదా పడటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే న్యాయ సలహా తీసుకోవాలనే ఆలోచనలో సాంకేతిక విద్యామండలి ఉంది.    

Advertisement
 
Advertisement
Advertisement