ఎట్టకేలకు ఒప్పుకున్నాడు

Enforcement Directorate first day trial finished for China Person Yaan Hu  - Sakshi

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నానన్న యాన్‌ హూ 

చైనా నుంచే ఆదేశాలు వచ్చేవని వెల్లడి 

ముగిసిన తొలిరోజు ఈడీ విచారణ 

సాక్షి, హైదరాబాద్:‌ ఆన్‌లైన్‌లో భారీ బెట్టింగ్‌కు పాల్పడిన కలర్‌ ప్రిడెక్షన్‌ యాప్‌ కేసులో ప్రధాన నిందితుడైన చైనా జాతీయుడు యాన్‌ హూ ఎట్టకేలకు అసలు విషయం అంగీకరించాడు. ఇప్పటివరకు తనకు ఏమీ తెలియదని, తాత్కాలిక ప్రాతిపదికపై వచ్చి ఇరుక్కుపోయానని చెప్పుకొచ్చాడు. తాజాగా ఇతడిని న్యాయస్థానం అనుమతితో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు మంగళవారం కస్టడీలోకి తీసుకుని విచారించారు.  ఈ కామర్స్‌ ముసుగులో ఆన్‌లైన్‌ బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్నానని, అందుకోసమే ఢిల్లీలో మకాం పెట్టానని ఒప్పుకున్నాడు. కలర్‌ ప్రిడెక్షన్‌ కేసుకు సంబంధించిన యాన్‌ హూతోపాటు ఢిల్లీవాసులు అంకిత్, ధీరజ్‌లను హైద రాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆగస్టు 13న అరెస్టు చేసిన విషయం విదితమే. లోతుగా దర్యాప్తు చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బీజింగ్‌ టుమారో పవర్‌ సంస్థకు చెందిన డమ్మీ కంపెనీల్లో ఒక దాని బ్యాంకు ఖాతాను ఇతడే నిర్వహిస్తున్నాడని, ఆ మేరకు బ్యాంకు ఖాతాదారుడి నుంచి ఆథరైజేషన్‌ కూడా తీసుకున్నాడని గుర్తించారు. యాన్‌ హూ   ఫోన్‌ లోని చాటింగ్స్‌ ద్వారా అతడి పాత్రను నిర్ధారించారు. ఆ ఫోన్‌లోని వాట్సాప్‌లో డాకీ పే పేరుతో ఉన్న గ్రూప్‌ చాటింగ్స్‌లో యాన్‌ హూ   ఆర్థిక లావాదేవీలు ఉండటంపై ఆధారాలు సేకరించారు.

కలర్‌ ప్రిడెక్షన్‌పై సిటీసైబర్‌ క్రైమ్‌ ఠాణాలో రెండు, ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. రూ.9 లక్షలు నష్టపోయిన తలాబ్‌కట్టవాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్‌నగర్‌ ఠాణాలో మరో కేసు నమోదైంది. సైబర్‌క్రైమ్‌ పోలీసులిచ్చిన సమాచారం మేరకు ఈడీ మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారులు కోర్టు అనుమతితో యాన్‌ హూను కస్టడీలోకి తీసుకున్నారు. ఈలోపు బెట్టింగ్‌ వ్యవహారంలో అతడి పాత్రపై కీలక ఆధారాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సేకరించారు. ఈడీ కస్టడీలో ఉన్న యాన్‌ హూ ఎదుట వీటిని పెట్టి ప్రశ్నించారు. దీంతో అతడు అసలు విషయం బయటపెట్టక తప్పలేదు. అయితే తాను చైనాలోని సూత్రధారుల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే పని చేశానంటూ చెప్పుకొచ్చాడు. వారు చెప్పినట్లే చేసేవాడినని, చెప్పిన ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేస్తుండేవాడినని చెప్పాడు. కలర్‌ ప్రిడెక్షన్‌ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురినీ ఈడీ అధికారులు మనీల్యాండరింగ్‌ కోణంలో విచారిస్తున్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top