ఏజెన్సీలో ఎన్‌కౌంటర్‌.. టెన్షన్‌ టెన్షన్‌

Encounter In Charla Mandal To Maoist Shootout - Sakshi

సాక్షి, కొత్తగూడెం : తెలంగాణలో మరోసారి మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా మావోల ఏరివేతపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసుశాఖ అటవీ ప్రాంతాల్లో వరుస కూంబింగులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే చర్ల-చత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరపడం గమనార్హం.  చర్ల మండలంలోని వడ్డిపేట, పుస్సుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పరిశీలించారు. మృతుల్లో ఒకరు శ్రీనివాస్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో బ్యారెల్ గన్, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. తాజా ఎన్‌కౌంటర్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో టెన్సన్‌ వాతావరణం నెలకొంది. (సమీక్షలతో డీజీపీ హల్ చల్)

మరోవైపు కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో పోలీసులు మోహరించారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్‌ దూది దేవాలు అలియాస్‌ శంకర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ పేరుతో కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన రహదారుల మీద దృష్టి కేంద్రీకరించిన పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. మావోయిస్టు బంద్‌ దృష్ట్యా ఏజెన్సీలో ప్రత్యేక బలగాలను మోహరింపజేసి కూంబింగ్‌ చేపట్టారు. స్పెషల్‌ పార్టీ బలగాలతో పాటు ఈ దఫా గ్రేహౌండ్స్‌ దళాలతో సరిహద్దు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే చర్ల మండలంలో తాజా ఎన్‌కౌంటర్‌ జరిపారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్‌ రెడ్డి వరుస పర్యటనల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్రల నుంచి తెలంగాణ లోకి మావోయిస్టుల కట్టడి విషయంలో పోలీసులకు డీజీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top