గ్రేటర్‌ ఆర్టీసీలో వీఆర్‌‘ఎస్‌’

Employees Lining Up For Voluntary Retirement In RTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)కు ఉద్యోగులు బారులు తీరుతున్నారు. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెలాఖరు వరకు గడువు విధించడంతో నగరంలోని వివిధ డిపోలకు చెందిన సీనియర్‌ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణకు ఆర్టీసీ యాజమాన్యం గతంలోనే ఒకసారి అవకాశం కల్పించింది. దాంతో అప్పట్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి.

పదవీ విరమణకు చేరువలో ఉన్న సుమారు 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ పథకంపై అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారు. అప్పటి నుంచి వీఆర్‌ఎస్‌ కోసం ఎదురు చూస్తున్న వాళ్లతో పాటు కొత్తగా మరికొందరికి అవకాశం కలి్పంచేందుకు తాజాగా మరోసారి దరఖాస్తులు ఆహా్వనించారు. ఈ నెలాఖరు వరకు గడువు విధించడంతో వివిధ డిపోలకు చెందిన సీనియర్‌ ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు.  

వయోభారమే కారణం.. 
ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 2019లో రెండేళ్లకు పెంచింది. దీంతో ఆ సంవత్సరం  ఉద్యోగ విరమణ చేయాల్సిన వాళ్లు 2021 వరకు విధులు నిర్వహించారు. కానీ.. చాలా మంది రెండేళ్ల పెంపును భారంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే డ్రైవర్లు, ఆ తర్వాత కండక్టర్లు స్వచ్ఛంద పదవీ విరమణ వైపే మొగ్గు చూపుతున్నారు. వయోభారం కారణంగా అధిక రక్తపో టు, మధుమేహం, గుండెజబ్బులతో బాధపడేవా ళ్లు విశ్రాంతిని కోరుకుంటున్నారు. అప్పట్లోనే సు మారు 1500 మంది వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోగా తాజా ప్రకటనతో మరికొంత మంది అదనంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది.  

తగ్గనున్న ఆర్థిక భారం.. 
ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో వివిధ విభాగాల్లో సుమారు 18 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పీకల్లోతు నష్టాల్లో నడుస్తున్న సంస్థలో ఇంధనం, విడిభాగాల కొనుగోళ్లు, బస్సుల నిర్వహణతో పాటు  ఉద్యోగుల జీతభత్యాలు కూడా భారంగానే మారాయి. ఈ క్రమంలో అదనపు భారాన్ని తగ్గించుకొనేందుకే  మరోసారి ఈ పథకాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం. 2019లోనే  వీఆర్‌ఎస్‌ ప్రస్తావన వచి్చనప్పటికీ అప్పట్లో ఉద్యోగ సంఘాలు గట్టిగా వ్యతిరేకించడంతో విరమించుకున్నారు.

ఆ తర్వాత వీఆర్‌ఎస్‌ ప్రతిపాదన ముందుకు వచ్చింది. అప్పటికి విధానపరమైన అంశాల్లో కారి్మక సంఘాల జోక్యం లేకపోవడంతో వీఆర్‌ఎస్‌ను ప్రతిపాదించారు. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు ఒక అవకాశంగా భావిస్తున్న అధికారులు తాజాగా వీఆర్‌ఎస్‌ను ప్రకటించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను డిపోల నుంచి సేకరించడం గమనార్హం.   

(చదవండి: నవీకరణ.. నవ్విపోదురు గాక!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top