విద్యుత్‌ బిల్లు తెస్తే మెరుపు సమ్మె  | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లు తెస్తే మెరుపు సమ్మె 

Published Mon, Dec 6 2021 3:30 AM

Electricity Employees And Engineers Warned Over Electricity Bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు–2021ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు ఒక రోజు విధులు బహిష్కరించి మెరుపు సమ్మె నిర్వహిస్తారని విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ హెచ్చరించింది. విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 8న రాష్ట్రాలు, జిల్లాల స్థాయిల్లో నిరసనలకు కమిటీ పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద 15న భారీ ధర్నాకు జాతీయ సమన్వయ కమిటీ సన్నాహాలు చేస్తోంది.

వచ్చే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల తొలి రోజైన 2022 ఫిబ్రవరి 1న దేశవ్యాప్తంగా విధులను బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగాలని కమిటీ పిలుపునిచ్చింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు మెరుపు సమ్మెకు దిగితే నిరంతర విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడి గ్రిడ్‌ కుప్పకూలి దేశమంతా అంధకారం నెలకొనే ప్రమాదం ఉంది. 

ప్రైవేటీకరణతో మాకు నష్టమే: ఉద్యోగులు 
విద్యుత్‌ పంపిణీ ప్రైవేటీకరణకు రాచమార్గం వేసేందుకు కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్‌ బిల్లుతో తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని దేశవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షల మంది విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్‌ చార్జీలు, సరఫరా, నాణ్యతలో ప్రైవేటు కంపెనీలతో పోటీపడలేవని, ఇదే జరిగితే ప్రభుత్వరంగ డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోయి మూతపడే ప్రమాదముందని అంటున్నారు.

ఫలితంగా లక్షల మంది విద్యుత్‌ ఉద్యోగులు రోడ్డునపడతారని విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ బిల్లు ద్వారా కేంద్రం తమ హక్కుల ను హరించేందుకు ప్రయత్నిస్తోందని చాలా రాష్ట్రా లు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతోంది. విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణతో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తాయని చెబుతోంది. ఈ విషయమై విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్రాల్లో గతంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశాల్లో తెలిపింది.   

Advertisement
Advertisement