టీ, కాఫీ తాగిన తర్వాత కప్పును తినేయండి.. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా?

Edible Biscuit Tea Or Coffee Cups Using In Siddipet Shops - Sakshi

బిస్కెట్‌ గ్లాసుల్లో టీ సరఫరా

రాగి, మక్క పిండి, చక్కెర, తేనెతో తయారీ

చాయ్‌ దుకాణాలకు విక్రయాలు

సాక్షి,సిద్దిపేట: టీ, కాఫీ తాగిన తర్వాత కప్పును తినేయండి అంటున్నారు సిద్దిపేటలోని పలు టీస్టాల్స్‌ యజమానులు. అదేంటి ప్లాస్టిక్‌ గ్లాస్‌ను తినడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అది ప్లాస్టిక్‌ కప్పు కాదండోయ్‌ బిస్కెట్‌తో తయారు చేసిన కప్పు. వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజమండి.. దీని గురించి తెలుసుకోవాలంటే మనం జిల్లా కేంద్రమైన సిద్దిపేటకు వెళ్లాల్సిందే. 

చాయ్‌ తాగిన తర్వాత ప్లాస్టిక్, పేపర్‌ కప్పులు అయితే పడేస్తారు. పింగాణీ అయితే కడిగి మళ్లీ వినియోగిస్తారు. ఈ ప్లాస్టిక్, పేపర్‌  కప్పుల ద్వారా కుప్పలుగా ప్లాస్టిక్‌ పేరుకుపోవడంతో పర్యావరణాకి ముప్పు వాటిల్లుతుందని గుర్తించిన సిద్దిపేటకు చెందిన నలుగురు యువకులు వినూత్న ఆలోచనతో ఈ బిస్కెట్‌ టీ కప్పుల తయారీకి శ్రీకారం చుట్టారు.  

వినూత్న ఆలోచనతో.. 
సిద్దిపేట పట్టణానికి చెందిన దావత్‌ అఖిల్‌ కుమార్, అల్లె రమేశ్, బుక్క శివ కుమార్, కందుకూరి శివ గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశారు. పర్యావరణానికి çహానీ చేయని పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు టీ స్టాల్‌ దగ్గర టీ కప్పుల కుప్పలు చూశారు. వీటి ద్వారా పర్యావరణానికి హానీ కలుగుతుందని గుర్తించారు. టీ తాగిన తర్వాత వృథాగా పడేయకుండా ఉండేందుకు కప్పును తినేవిధంగా తయారు చేయాలని ఓ ఐడియాకు వచ్చారు.

తొలుత బిస్కెట్‌తో తయారు చేసిన ఐస్‌క్రీం కప్పులో టీ తాగి చూశారు. బెంగళూరులోని కప్పులు తయారు చేసే పరిశ్రమకు వెళ్లి పరిశీలించారు.  ఏ మెటీరియల్‌ను వినియోగిస్తున్నారో తెలుసుకున్నారు. చిన్న సైజు కప్పును తయారు చేసిన దానిలో టీ ని అందిస్తే తాగిన తర్వాత తినే విధంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. అనంతరం అక్కడి నుంచి తమకు కావాల్సిన విధమైన మిషన్‌ను కొనుగోలు చేసి తీసుకొచ్చారు.  
చదవండి: వరిచేలలో రామ్‌ చరణ్‌ చిత్రం.. షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ అభిమానం

6 నిమిషాల్లో 40 తయారీ
రాగి, మైదా, మొక్కజొన్న పిండి, చక్కెర, తెనేలను బాగా మిక్స్‌ చేసి ఒక డై లో మొదట ఆ మిశ్రమంను పొస్తారు. తర్వాత మిషనరీలో ఉన్న టీ కప్పు డై లో ఈ మిశ్రమంను వేస్తారు. సుమారుగా 6 నిముషాల పాటు అందులోనే ఉంచుతున్నారు. హీటర్‌ల ద్వారా వేడి అయి గట్టి పడుతుంది. డై ని ఓపెన్‌ చేసి కప్పులను తీస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేటలోని పలు టీస్టాల్‌లకు ఈ కప్పులను సరఫరా చేస్తున్నారు. ఒక్కో టీ కప్పు రూ.3.5 విక్రయిస్తున్నారు. ఈ కప్పుల్లో టీ తాగిన ప్రజలు తర్వాత వాటిని తింటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

పర్యావరణానికి రక్షగా 
సిద్దిపేటలో మున్సిపాలిటీ, మంత్రి హరీశ్‌రావు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నారు. మా వంతు కృషిగా బిస్కెట్‌ టీ కప్పులను తయారు చేస్తున్నాం. ప్రస్తుతానికి సిద్దిపేటలోనే సరఫరా చేస్తున్నాం.  ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రొడక్షన్‌ పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తాం. మేము నలుగురమే తయారు చేసి మార్కెటింగ్‌ చేసుకుంటున్నాం. 
– అఖిల్, రమేశ్, శివ కుమార్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top