breaking news
coffee cup
-
టీ, కాఫీ తాగిన తర్వాత కప్పును తినేయండి.. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా?
సాక్షి,సిద్దిపేట: టీ, కాఫీ తాగిన తర్వాత కప్పును తినేయండి అంటున్నారు సిద్దిపేటలోని పలు టీస్టాల్స్ యజమానులు. అదేంటి ప్లాస్టిక్ గ్లాస్‌ను తినడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అది ప్లాస్టిక్ కప్పు కాదండోయ్ బిస్కెట్‌తో తయారు చేసిన కప్పు. వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజమండి.. దీని గురించి తెలుసుకోవాలంటే మనం జిల్లా కేంద్రమైన సిద్దిపేటకు వెళ్లాల్సిందే. చాయ్ తాగిన తర్వాత ప్లాస్టిక్, పేపర్ కప్పులు అయితే పడేస్తారు. పింగాణీ అయితే కడిగి మళ్లీ వినియోగిస్తారు. ఈ ప్లాస్టిక్, పేపర్ కప్పుల ద్వారా కుప్పలుగా ప్లాస్టిక్ పేరుకుపోవడంతో పర్యావరణాకి ముప్పు వాటిల్లుతుందని గుర్తించిన సిద్దిపేటకు చెందిన నలుగురు యువకులు వినూత్న ఆలోచనతో ఈ బిస్కెట్ టీ కప్పుల తయారీకి శ్రీకారం చుట్టారు. వినూత్న ఆలోచనతో.. సిద్దిపేట పట్టణానికి చెందిన దావత్ అఖిల్ కుమార్, అల్లె రమేశ్, బుక్క శివ కుమార్, కందుకూరి శివ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. పర్యావరణానికి çహానీ చేయని పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు టీ స్టాల్ దగ్గర టీ కప్పుల కుప్పలు చూశారు. వీటి ద్వారా పర్యావరణానికి హానీ కలుగుతుందని గుర్తించారు. టీ తాగిన తర్వాత వృథాగా పడేయకుండా ఉండేందుకు కప్పును తినేవిధంగా తయారు చేయాలని ఓ ఐడియాకు వచ్చారు. తొలుత బిస్కెట్‌తో తయారు చేసిన ఐస్‌క్రీం కప్పులో టీ తాగి చూశారు. బెంగళూరులోని కప్పులు తయారు చేసే పరిశ్రమకు వెళ్లి పరిశీలించారు. ఏ మెటీరియల్‌ను వినియోగిస్తున్నారో తెలుసుకున్నారు. చిన్న సైజు కప్పును తయారు చేసిన దానిలో టీ ని అందిస్తే తాగిన తర్వాత తినే విధంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. అనంతరం అక్కడి నుంచి తమకు కావాల్సిన విధమైన మిషన్‌ను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. చదవండి: వరిచేలలో రామ్ చరణ్ చిత్రం.. షార్ట్ ఫిలిం డైరెక్టర్ అభిమానం 6 నిమిషాల్లో 40 తయారీ రాగి, మైదా, మొక్కజొన్న పిండి, చక్కెర, తెనేలను బాగా మిక్స్ చేసి ఒక డై లో మొదట ఆ మిశ్రమంను పొస్తారు. తర్వాత మిషనరీలో ఉన్న టీ కప్పు డై లో ఈ మిశ్రమంను వేస్తారు. సుమారుగా 6 నిముషాల పాటు అందులోనే ఉంచుతున్నారు. హీటర్ల ద్వారా వేడి అయి గట్టి పడుతుంది. డై ని ఓపెన్ చేసి కప్పులను తీస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేటలోని పలు టీస్టాల్‌లకు ఈ కప్పులను సరఫరా చేస్తున్నారు. ఒక్కో టీ కప్పు రూ.3.5 విక్రయిస్తున్నారు. ఈ కప్పుల్లో టీ తాగిన ప్రజలు తర్వాత వాటిని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. పర్యావరణానికి రక్షగా సిద్దిపేటలో మున్సిపాలిటీ, మంత్రి హరీశ్‌రావు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నారు. మా వంతు కృషిగా బిస్కెట్ టీ కప్పులను తయారు చేస్తున్నాం. ప్రస్తుతానికి సిద్దిపేటలోనే సరఫరా చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రొడక్షన్ పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తాం. మేము నలుగురమే తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాం. – అఖిల్, రమేశ్, శివ కుమార్ -
కాఫీ కప్పులో కళాత్మకత
నగరంలో ‘లాటే ఆర్ట్’కు పెరుగుతున్న ఆదరణ కాఫీపై వివిధ ఆకారాలు, సందేశాలు తీర్చిదిద్దుతున్న లాటే ఆర్టిస్ట్‌లు ఆప్తులకు శుభాకాంక్షలు చెప్పడానికీ ‘లాటే ఆర్ట్’ను ఉపయోగిస్తున్న యువత సాక్షి, బెంగళూరు: శ్రేష్టమైన కాఫీ గింజల నుంచి తయారై, పొగలు కక్కే డికాషన్‌గా మారి, చిక్కటి పాలు, తియ్యని పంచదారలతో కలగలిసి చక్కగా, చిక్కగా తయారయ్యే ‘కాఫీ’ని ఇష్టపడని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే కాఫీని ఇలా రుచికరంగా తయారుచేయడం అంత సులభం కాదు. అందుకే అమోఘమైన కాఫీని తయారుచేయడాన్ని కూడా ఒక కళగా చెబుతుంటారు చాలా మంది. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కాఫీ కూడా కళాత్మకంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి వ్యక్తుల కోసం రూపొందినదే ‘లాటే ఆర్ట్’. పొగలు కక్కే కాఫీ కప్పుపై అందమైన రూపాలను, ఆకర్షణీయమైన సందేశాలను తీర్చిదిద్దడమే లాటే ఆర్ట్. ఇటలీలో పుట్టి, అమెరికాలో ప్రఖ్యాతిగాంచి, ఆ తరువాత భారతదేశంలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం నగర యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘లాటే ఆర్ట్’కి సంబంధించిన విశేషాలేంటో చూద్దామా.... లాటే ఆర్ట్ అంటే... కాఫీ కప్పులో వివిధ కళాత్మక రూపాలను ఆవిష్కరించడాన్నే ‘లాటే ఆర్ట్’గా పిలుస్తారు. 1960ల కాలంలో ఇటలీలో ఈ ‘లాటే ఆర్ట్’ ప్రాణం పోసుకుంది. కాఫీ తయారీ విధానం (బ్రూయింగ్)లో నిపుణుడైన డేవిడ్ స్కూమర్ ఈ లాటే ఆర్ట్‌ని పరిచయం చేసిన వాడని చెబుతారు. అలా ఇటలీలో మొదటగా వెలుగులోకి వచ్చిన లాటే ఆర్ట్ 1980-90ల కాలానికి అమెరికాకు విస్తరించింది. అనంతరం భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రాచుర్యాన్ని పొందింది. ప్రస్తుతం నగర యువత హాట్ ఫేవరేట్‌గా మారింది. సాధారణంగా డికాషన్, పాల మిశ్రమంగా కాఫీ తయారవుతుంది. లాటే ఆర్ట్ కోసం ఉపయోగించే కాఫీకి మాత్రం ముందుగా డికాషన్ పోసి అనంతరం ఒక పొరలా పాల నురగను పరుస్తారు. ఆ పైన క్రీమ్ లేదా మిల్క్ చాక్లెట్లను పోస్తారు. ఇలా పోయడం కూడా ఒక కళే. అనంతరం వాటిపై వివిధ రకాల ఆకృతులను ఆవిష్కరిస్తారు. అయితే సాధారణంగా చేతితో కలిసిన కాఫీపై ఇలాంటి ఆకృతులను సృష్టించడం సాధ్యం కాదు. కేవలం యంత్రాల సాయంతో తయారుచేసే వేడి ఇటాలియన్ సై ్టల్ కాఫీపైనే ఈ తరహా కళారూపాలను ఆవిష్కరించడం సాధ్యమవుతుంది. ‘లాటే ఆర్ట్’లోనూ రెండు రకాలు... కాఫీ కప్పును కళాత్మకంగా తీర్చిదిద్దే లాటే ఆర్ట్‌లోనూ రెండు ముఖ్యమైన రకాలున్నాయి. అవి ఫ్రీ పౌరింగ్, ఎచింగ్. కాఫీ కప్పుపై క్రీమ్లేదా మిల్క్ చాక్లెట్లను పోసిన తరువాత ఒక పాత్రలో పాల నురగను తీసుకొని దాన్ని కాఫీ కప్పుపై ఒక ఆకృతిలో వచ్చేలా పోయడమే ఫ్రీ పౌరింగ్. ఇక కాఫీ కప్పుపై పరిచిన క్రీమ్‌పై ఒక సన్నటి టూత్‌పిక్ లేదా పదునైన కొన ఉన్న ఏదైనా వస్తువుతో వివిధ ఆకృతులను ఆవిష్కరించడాన్ని ఎచింగ్గా పిలుస్తారు. సాధారణంగా ఎచింగ్ విధానంలో వివిధ రకాల జంతువుల ఆకృతులను వేగంగా ఆవిష్కరించవచ్చని ‘లాటే ఆర్ట్’ నిపుణులు చెబుతూ ఉంటారు. మనసులో మాట తెలపడానికి కూడా.... మన మనసులో ఉన్న మాట ఎదుటి వ్యక్తికి తెలియజెప్పడానికి ‘కాఫీ టైం’ ఎంతో అనువైనదనేది నిన్నటి వరకు చాలా మందిలో ఉన్న భావన. అయితే నేటి తరం ఇందుకు మరింత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. కాఫీ టైంలో కాక కాఫీ కప్పుతోనే తమ మనసులోని భావాలను ఎదుటి వాళ్లకు చెప్పేస్తున్నారు. ‘మా కాఫీ షాప్‌కి వచ్చే చాలా మంది యువతీ యువకులు తమ మనసులోని మాటలు చెప్పడానికి లాటే ఆర్ట్‌ని ఉపయోగిస్తున్నారు. ‘ఐ లవ్ యూ’ అని కాఫీపై రాయించి కొందరు ప్రపోజ్ చేస్తుంటే, ‘నా మనసులో నువ్వే ఉన్నావ్’ అని చెప్పేందుకు ప్రేయసి బొమ్మను కాఫీపై వేయించే వారు మరి కొందరు. అంతేకాదు స్నేహితులకు శుభాకాంక్షలు కూడా చాలా మంది కాఫీ కప్పుతోనే చెప్పేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ‘లాటే ఆర్ట్’లో నైపుణ్యం వారికి వివిధ ప్రముఖ కాఫీ షాప్‌లలో డిమాండ్ ఎక్కువగా ఉంది’ అని నగరంలోని ఓ ప్రముఖ కాఫీ షాప్ మేనేజర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఎలా పరిచయమైందంటే.... ఒకప్పుడు చిన్న చిన్న తోపుడు బండ్లపైనో లేదంటే హోటల్లో ఓ మూలకో కాఫీ తయారీ పరిమితమయ్యేది. అయితే కాఫీపై ప్రజల్లో పెరుగుతున్న మక్కువతో కేవలం కాఫీ తయారీకే ప్రత్యేకంగా దుకాణాలు వెలుస్తున్నాయి. ఇప్పుడు కాఫీ షాప్లంటే యూత్‌ల అడ్డా. పొగలు కక్కే కాఫీతో పాటు చల్లగా జిల్లుమనిపించే కోల్డ్ కాఫీలు కూడా ఇప్పుడు యువతకు హాట్ ఫేవరేట్. కాఫీ షాప్‌లో కూర్చుని కేవలం కాఫీని ఆస్వాదించడమే కాదు, కాలేజ్ కబుర్లను చెప్పుకోవడానికి విద్యార్థులు, ప్రాజెక్టు వర్కుల గురించి చర్చించుకోవడానికి ఉద్యోగులు, వారాంతాల్లో పిల్లలకో కొత్త కాఫీ ‘టేస్ట్’ని రుచి చూపించడానికి నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వివిధ బ్రాండెడ్ కాఫీ షాప్‌ల మధ్య పోటీ కూడా పెరిగింది. కేవలం కాఫీని అందించడమే కాక కాఫీ కప్పుకు మరిన్ని హంగులు జోడించడానికి వివిధ కాఫీ షాప్‌లు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే విదేశాల్లో ప్రఖ్యాతి గాంచిన ‘లాటే ఆర్ట్’ని నగర వాసులకు పరిచయం చేశాయి.