వసతుల కల్పనతో సత్వర న్యాయం | Sakshi
Sakshi News home page

వసతుల కల్పనతో సత్వర న్యాయం

Published Thu, Mar 28 2024 1:08 AM

DY Chandrachud On Basic Facilities In Courts - Sakshi

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

కోర్టుల్లో పనిచేసే సిబ్బందికి అవి బూస్ట్‌లా పనిచేస్తాయి..  

దేశవ్యాప్తంగా దిగువ కోర్టులతో పాటు హైకోర్టుల్లోనూ సదుపాయాల కొరత..  

కనీసం టాయిలెట్లు లేని కోర్టులు కూడా ఉన్నాయి.. అలాంటప్పుడు మహిళల పరిస్థితేమిటి? వారు ఎలా ఉండాలి? 

మహిళలు, దివ్యాంగులకు అన్ని సౌకర్యాలూ ఉండాలని సూచన 

తెలంగాణ హైకోర్టు నూతన ప్రాంగణానికి సీజేఐ శంకుస్థాపన..

32 జిల్లా కోర్టుల్లో ఈ–సేవా కేంద్రాలు ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌: కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన సత్వర న్యాయానికి దోహదపడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయస్థానాల్లో ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. కోర్టుల్లో పనిచేసే వారికి వసతులు బూస్ట్‌లా పనిచేస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా దిగువ కోర్టుల్లోనే కాకుండా హైకోర్టుల్లోనూ సదుపాయాల కొరత ఉందని తెలిపారు. కనీసం టాయిలెట్లు లేని కోర్టులు కూడా ఉన్నాయని వెల్లడించారు.

‘మరి మహిళలు ఎక్కడికి పోవాలి? ఉదయం ఇంటి నుంచి వస్తే సాయంత్రం ఇల్లు చేరేవరకు వారు ఎలా ఉండాలి? పాలిచ్చే తల్లి కోసం ఓ గది, చిన్న పిల్లల కోసం ఊయల.. ఇలా కనీస వసతులు కూడా లేని పరిస్థితి ఉంది..’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌లో 100 ఎకరాల్లో నిర్మించనున్న తెలంగాణ హైకోర్టు నూతన ప్రాంగణానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్‌ ఎస్వీ భట్టి, రాష్ట్ర హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధేతో కలసి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు.  

కోర్టులు మార్గదర్శకంగా నిలవాలి 
‘హైకోర్టు అనేది ప్రజల హక్కులను, విలువలను, విధులను పరిరక్షించే ఒక ప్రాంతం. మహిళలంటే వివక్ష తగదు. మహిళలకు, దివ్యాంగులకు కొత్త భవనంలో అన్ని సౌకర్యాలూ ఉండాలి. అన్ని వనరులతో పనిచేస్తూ కోర్టులు ఇతర ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకంగా నిలవాలి. సాంకేతికతను వినియోగించుకోవాలి. ఈ–కోర్టుల్లో భాగంగా ఈ–సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం.

న్యాయవాదులైనా, న్యాయమూర్తులైనా.. జూనియర్లకు సీనియర్లు సలహాలు, సూచనలు ఇస్తుండాలి. ఇది న్యాయ విలువలను పెంపొందిస్తుంది. జస్టిస్‌ చిన్నపరెడ్డి, జస్టిస్‌ సుబ్బారావు, జస్టిస్‌ జీవన్‌రెడ్డి లాంటి వారు ఇక్కడినుంచి సుప్రీంకోర్టు వరకు ఎదిగి న్యాయ వ్యవస్థ విలువలు పెంపొందించారు..’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ గుర్తు చేశారు. 

నా కల నెరవేరుతోంది: జస్టిస్‌ పీఎస్‌ నరసింహ 
‘నేను తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశా. న్యాయవాదిగా నమోదు చేసుకున్న కొత్తలో ఎప్పుడూ వసతుల లేమిపై ఆలోచిస్తుండేవాడిని. న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులకు మౌలిక సదుపాయాలు ఉంటే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని అనిపించేది. నాటి కల ఇప్పుడు కొత్త భవన నిర్మాణంతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. హైకోర్టు భవన నిర్మాణం వెనుక సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే కృషి అభినందనీయం.

ప్రభుత్వాన్ని కూడా ప్రశంసించాల్సిందే. నిజాం కాలం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఇలా మూడు దశల్లోనూ వందేళ్లకు పైగా ప్రస్తుత భవనం సేవలందించింది. ప్రస్తుతం జడ్జిల చాంబర్లు కూడా బాగాలేవు. లాన్‌లో సమావేశాలు నిర్వహించుకోవాల్సి వస్తోంది. జడ్జిలకే కాదు.. న్యాయవాదులకు కూడా కన్సల్టేషన్‌ రూంలు అవసరం. మీటింగ్‌ చాంబర్, క్లినిక్‌ల్లాంటివి లగ్జరీ వసతులేం కావు. కనీస వసతులే. పూర్తి పర్యావరణ హితంగా హైకోర్టు నిర్మాణం జరగాలి..’ అని జస్టిస్‌ పీఎస్‌ నరసింహ సూచించారు. 

అందరికీ ఉపయుక్తంగా కొత్త కోర్టు: సీజే అలోక్‌ అరాధే 
‘కోర్టులు అన్ని వసతులతో సిద్ధంగా ఉంటే వేగవంతంగా, పారదర్శకంగా కేసులు పూర్తి చేయవచ్చు. కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు న్యాయ వర్గాలకే కాదు.. ప్రజలకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. పర్యావరణ హితంగా నిర్మాణం సాగుతుంది..’ అని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే చెప్పారు. హైకోర్టు నిర్మాణానికి వేగంగా చర్యలు చేపట్టిన ప్రభుత్వానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, రిజి్రస్టార్లు, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) నరసింహ శర్మ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) గాడి ప్రవీణ్‌కుమార్, అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు, హైకోర్టు పీపీ పల్లె నాగేశ్వర్‌రావు, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 32 జిల్లా కోర్టుల్లో ఈ–సేవా కేంద్రాలను జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రారంభించారు. 

విద్యార్థి సంఘాల నేతల అరెస్టు 
ఏజీ వర్సిటీ: నూతన హైకోర్టు భవనానికి శంకుస్థాపన పురస్కరించుకుని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు వర్సిటీలకు చెందిన 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు, వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల విద్యార్థులు గత 60 రోజులుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు. 

Advertisement
Advertisement