రీల్స్ మోజులో మెడికోలు.. సేవలు మర్చిపోయారా? | Doctors in Adilabad RIMS Under Fire for Filming Reels Inside Hospital | Sakshi
Sakshi News home page

రీల్స్ మోజులో మెడికోలు.. సేవలు మర్చిపోయారా?

Apr 15 2026 2:13 PM | Updated on Apr 15 2026 2:13 PM

Doctors in Adilabad RIMS Under Fire for Filming Reels Inside Hospital

ఆదిలాబాద్‌టౌన్‌: రోగులకు వైద్య సేవలు అందించాల రిమ్స్‌ ఆస్పత్రి ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా మారింది.. కొంతమంది మెడికోలు, జూడాలు, పలువురు వైద్యులు రీల్స్‌ చేయడం పట్ల చర్చ సాగుతోంది. విధులు నిర్వహించే సమయంలో ‘రీల్స్‌ మోజు’లో పడి రోగులనే మర్చిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు. ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ సినిమా తరహాలో ఏకంగా ఆపరేషన్‌ థియేటర్‌లో శస్త్ర చికిత్సకు ముందు రోగితో డ్యాన్స్‌ చేయడం, ఆస్పత్రిలోని ఇతర పరికరాలను చేతిలో పట్టుకొని సోషల్‌ మీడియా కోసం వీడియోలను చిత్రీకరిస్తున్నారు. విధుల్లో ఉన్న సమయంలో కాకుండా ఇతర సమయంలో రీల్స్‌ చేస్తే పట్టించుకునేది కాదని, ఆస్పత్రి ఆవరణతో పాటు ఆయా వార్డుల్లో వీడియోలు షూట్‌ చేస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. అయితే రోగులతో కలిసి వీడియోలు తీయడం ద్వారా ఆ రోగి గోప్యత బయట పడుతుందని పలువురు చెబుతున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు అసౌకర్యంగా మారిందని పేర్కొంటున్నారు.

‘లైక్‌’ల కోసం..
ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో పలువురు ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేట్‌ వైద్యులు, వారి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోలు అంతటా హల్‌చల్‌ కావడంతో రిమ్స్‌లోని పలువురు మెడికోలు, జూడాలు, కొంత మంది వైద్యులు సైతం వారిలాగే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ ‘లైక్స్‌’ కోసం వీడియోలు తీస్తూ రెచ్చిపోతున్నారు. ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు రోగులకు ఇబ్బందులు ఎదురైనా సరే.. ఫాలోవర్స్‌ కోసం నానా తంటాలు పడుతున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి్సన వీరే ఇలా డ్యాన్సులు చేయడం, రీల్స్‌ తయారు చేయడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ విషయమై రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ను ఫోన్‌లో వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement