
వచ్చేనెల 10 నుంచి 15 వరకు అర్హులకు శిక్షణ కార్యక్రమాలు
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ రెండో తేదీన మంజూరు పత్రాలను అందిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ఈ మంజూరు పత్రాల పంపిణీకి క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. యువ వికాసం పథకం అమలు పురోగతిపై మంగళవారం సచివాలయంలో సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు భట్టి పలుసూచనలు చేశారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించాలన్నారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జూన్ 16వ తేదీ నుంచి స్వయం ఉపాధి యూనిట్ల ప్రారం¿ోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గాంధీ జయంతి నాటికి యూనిట్లన్నీ గ్రౌండింగ్ అయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.
సంక్షేమ శాఖ అధికారులు బ్యాంకర్లతో తరచూ మాట్లాడుతూ స్వయం ఉపాధి పథకాన్ని విజయవంతంగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
కీర్తి ప్రతిబింబించేలా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: తెలంగాణ రాష్ట్ర చరిత్ర, కీర్తి ప్రతిబింబించేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని, ఇందు కోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులకు సూచించారు. ఆవిర్భావ దినోత్సవ సమన్వయ సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై భట్టి సమీక్షించారు. సమావేశంలో భాగంగా భట్టి మాట్లాడుతూ ఈసారి అవతరణ వేడుకలకు అతిథులుగా జపాన్ మేయర్‌తో పాటు మిస్‌వరల్డ్ విజేతలు హాజరవుతారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.