Telangana: జమునా హేచరీస్‌ భూములు బాధిత రైతులకు పంపిణీ

Distribution Of Lands To Jamuna Hatcheries‌ Affected Farmers - Sakshi

మెదక్‌ జిల్లాలో అసైన్డ్‌ భూములు కబ్జా చేసినట్లు ఈటలపై ఆరోపణలు

మెదక్‌ జోన్‌/ వెల్దుర్తి: మెదక్‌ జిల్లా మాసాయిపేట, చిన్నశంకరంపేట మండలాల్లోని వివాదాస్పద అసైన్డ్‌ భూములను అధికారులు బుధవారం బాధిత రైతులకు అప్పగించారు. తమ భూములను కాజేశారంటూ ఆయా మండలాల్లోని అచ్చంపేట, హకీంపేట, దరిపల్లి గ్రామాల రైతులు ప్రస్తుత బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (జమునా హేచరీస్‌)పై గతేడాది ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కాగా ప్రభుత్వ ఆదేశంతో సర్వే చేయించిన కలెక్టర్‌ హరీశ్‌ 66 ఎకరాల అసైన్డ్‌ భూములు కబ్జాకు గురై నట్లుగా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. దీనిపై జమునా హేచరీస్‌ కోర్టును ఆశ్రయిం చగా, 2021 నవంబర్‌లో మరో సర్వే చేశారు. 85 ఎకరాల 19 గుంటల భూమి కబ్జాకు గురైనట్టు గుర్తించి నివేదిక అందించారు.

దీంతో ఈ భూమిని తిరిగి బాధితులకు అప్పగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీఓ విడుదల చేసింది. దీంతో బుధవారం రెవెన్యూ అధికారులు మూడు సర్వే బృందాలను ఏర్పాటు చేసి  బాధిత రైతులకు ఆయా సర్వే నంబర్లలో డివిజన్ల వారీగా హద్దులు చూపెట్టారు. ఈ ప్రక్రియ పరిశీలించడానికి వచ్చిన మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బాధిత లబ్ధిదారులకు ఆ మేరకు పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మాసాయిపేట మండ లం అచ్చంపేట శివారులోని 77, 78, 79, 80, 81, 82 సర్వే నంబర్లలో 62 మంది బాధితులకు 84 ఎకరాల 19 గుంటలు, హకీంపేట శివారులో సర్వే నంబరు 97లో ముగ్గురు రైతులకు ఎకరం భూమికి సంబంధించి పట్టాలు అందజేశారు.

పట్టాలు సరే.. నిర్మాణాల సంగతేంటి?
ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాలతో రైతులు హర్షం వ్యక్తం చేయగా, కొందరు మాత్రం అయోమయంలో ఉన్నారు. వారికి చూపించిన హద్దుల్లో హేచరీస్‌కు చెందిన శాశ్వత కట్టడాలు ఉండటంతో వాటిని ఎవరు..ఎప్పుడు తొలగిస్తారు అందులో తామెలా వ్యవసాయం చేసుకునేదని పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉండగా..పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు అడ్డుకుం టారేమోనని తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వ ర్యంలో పోలీసులు జమునా హేచరీస్‌ ముందు  మోహరించారు. ఎవరైనా ఆందోళనలు చేస్తే అరెస్టు లు చేసి అక్కడి నుంచి తరలించేందుకు వీలుగా ప్రైవేట్‌ బస్సులు, డీసీఎంలను ఏర్పాటు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top