
ములుగు జిల్లాలో గోదావరి ముంపు గ్రామం కొండాయి ప్రజల అవస్థ
అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు, దొడ్ల గ్రామస్తులు
హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని గోదావరి ముంపు గ్రామం కొండాయి ప్రజలు సొంత గ్రామంలో ఉండలేక, పొరుగు గ్రామస్తులు రానివ్వక దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. అధికారులు ఈ గ్రామాన్ని ఖాళీ చేయాలని చెప్పటంతో సోమవారం గ్రామస్తులు ఊరు ఖాళీ చేసి జంపన్నవాగు దాటి దొడ్ల అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారు. సుమారు 25 కుటుంబాలు కర్రలు, కవర్లతో తాత్కాలికంగా గుడిసెలు నిర్మించుకున్నారు.
విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వాటిని తొలగించి ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో మాత్రమే గుడిసెలు వేసుకోవాలని స్పష్టంచేశారు. మరోవైపు దొడ్ల గ్రామస్తులు సైతం కొండాయి ప్రజలు ఇక్కడికి రావద్దని అడ్డుకున్నారు. కాగా, కొండాయి వద్ద కూలిపోయిన వంతెనను పరిశీలించేందుకు వచ్చిన ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంకను సోమవారం కొండాయి ప్రజలు అడ్డుకుని తమకు పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొడ్ల గ్రామ ప్రజలు కూడా శశాంకను అడ్డుకుని కొండాయి గ్రామస్తులకు వేరేచోట భూమి కేటాయించాలని నిరసన తెలిపారు.