తోలు పరిశ్రమల జాడేదీ?

Development of mini leather parks in the state due to lack of funds - Sakshi

రాష్ట్రంలో మినీ లెదర్‌ పార్కుల అభివృద్ధి అంతంతే

పూర్తిస్థాయిలో విడుదలవని నిధులు

అన్యాక్రాంతం అవుతున్న పరిశ్రమల స్థలాలు

ఉపాధి లేక వేలాది మంది దళితుల ఎదురుచూపులు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిరుపేద దళితులకు ఉపాధి, స్థానికంగానే తోలు ఉత్పత్తులు తయారుచేసి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపికచేసి మినీ లెదర్‌ పార్కులు స్థాపించాలని ప్రణాళికలు చేశారు. లెదర్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (లిడ్‌క్యాప్‌) నిరుద్యోగ యువతకు చెప్పుల తయారీలో శిక్షణ సైతం ఇచ్చింది. శిక్షణ తీసుకున్న వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. 2003 నుంచే లెదర్‌ పార్కుల ఏర్పాటుకు బీజం పడినా నేటికీ ఉత్పత్తి ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ దళితులు ఎదురుచూస్తున్నారు.

లెదర్‌ ఉత్పత్తులకు అవకాశం
మేక, గొర్రె, గేదెల వంటి పశువుల తోళ్లతో స్థానికంగానే ప్రముఖ బ్రాండ్లకు చర్మంతో చెప్పులు, ఇతర ఉత్పత్తులు తయారుచేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రం నుంచే లిడ్‌క్యాప్, రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్‌ఎల్‌ఐపీసీ (తెలంగాణ స్టేట్‌ లెదర్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌) «ఆధ్వర్యంలో పనులు సాగాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కు, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో లెదర్‌ క్లస్టర్, మరో ఆరుచోట్ల 25 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించారు.

‘మలుపు’స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులకు శిక్షణనిచ్చింది. చెన్నైకి చెందిన లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకొని ప్రముఖ బ్రాండ్ల చెప్పులు, బూట్లు ఇతర ఉత్పత్తులు ఈ పార్కుల్లో తయారు చేయాలని భావించారు. ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకొనేలా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరిగాయి. మౌలిక సదుపాయాలు, షెడ్డుల నిర్మాణాలు, శిక్షణ, యంత్రాలు వచ్చాయి. కొన్నిచోట్ల తయారీ మొదలైంది. ఆ తర్వాత నిధుల లేమితో ఆశయం నీరుగారింది.

నిధులు విడుదలవక..
తెలంగాణ రాష్ట్రం వచ్చాక మరోమారు పార్కుల స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ కింద రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వీటిని అభివృద్ధి చేయాలనుకున్నారు. 2016లో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కుకు రూ.270 కోట్లతో 2 వేల మందికి ఉపాధి కల్పించాలనే అంచనాతో రూ.105 కోట్ల కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఇప్పటికీ నిధులు విడుదలవలేదు. ఇటీవల ఆర్మూర్‌ పార్కులో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదలవక ఉత్పత్తి మొదలు కాలేదు.

కబ్జాలకు గురవుతున్న భూములు
పార్కుల కోసం కేటాయించిన భూములు ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో కబ్జాకు గురవుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో అక్కడ ఇన్‌చార్జి అధికారే ఆ భూమిలోని మట్టిని అమ్ముకున్నారు. కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లో భూములను ఓ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మూర్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలం చుట్టూ కబ్జాల నిరోధానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఈ స్థలాలను పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, క్రీడాప్రాంగణాలకు కేటాయిస్తుండటంతో దళితులు ఆందోళన చెందుతున్నారు.

నాయకులకు చిత్తశుద్ధి లేదు
ఏళ్లుగా ఉపాధి పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా లెదర్‌ పార్కులు ఏర్పాటుచేసి నిరుపేదలకు పని కల్పించాలి.
– కొలుగూరి విజయ్‌కుమార్, చర్మకార హక్కుల పరిరక్షణ కమిటీ, జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top