పద్ధతిగా పట్టణాభివృద్ధి

Development Of Corporations And Municipalities In Telangana - Sakshi

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మౌలికవసతులకు సర్కారు మాస్టర్‌ప్లాన్‌

జోన్లుగా విభజించి ప్రాంతాల అభివృద్ధి.. ఆపై జీఐఎస్‌తో అనుసంధానం

జూన్‌ 2 నాటికి ప్రణాళికలు సిద్ధమయ్యేలా కార్యాచరణ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసే ప్రక్రియ రూపుదిద్దుకుంటోంది. పట్టణాలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు సర్కార్‌ మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. వానలు, వరదలు వచ్చినా నష్టం కలగకుండా పట్టణాల్లో నాలాల అభివృద్ధి, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మొదలు పన్ను వసూళ్లకు శాస్త్రీయ విధానాన్ని రూపొందించడం వరకు మాస్టర్‌ ప్లాన్‌లో పొందుపరుస్తోంది.

జీహెచ్‌ఎంసీ, శివారు ప్రాంతాలతోపాటు వరంగల్‌ కార్పొరేషన్, ఇతర పట్టణాల్లో గత రెండేళ్లుగా వర్షాలతో ప్రజలు పడుతున్న కష్టాలు పునరావృతం కాకుండా మాస్టర్‌ప్లాన్‌లు రెడీ అవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్‌ 2 నాటికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాస్టర్‌ప్లాన్‌లను సిద్ధం చేయాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

రెసిడెన్షియల్, వాణిజ్య, గ్రీన్‌ జోన్లుగా..
మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నగరాలు, పట్టణాలను నివాస, వాణిజ్య, బఫర్‌ లేదా గ్రీన్‌ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని మున్సిపల్‌ శాఖ నిర్ణయించింది. బెంగళూరు, చండీగఢ్‌ నగరాల తరహాలో నివాస, నివాసేతర ప్రాంతాలను జోన్లుగా విభజించనుంది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న విధానాన్ని పూర్తిస్థాయిలో మార్చలేకపోయినా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో జోన్‌ల వారీగా విభజించి రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేయనుంది.

క్రీడా మైదానాలు, ఎగ్జిబిషన్లతోపాటు ప్రజలకు ఉపయోగపడే వాటిని గుర్తించి అభివృద్ధి చేపట్టనుంది. ఈ జోన్లను జీఐఎస్‌ (జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌)తో అనుసంధానించి భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లు మౌలికవసతులు అభివృద్ధి చేయనుంది. ప్రయోగాత్మకంగా 17 మున్సిపా లిటీల్లో ఇప్పటికే జీఐఎస్‌ ఆధారిత మాస్టర్‌ ప్లాన్లు తయారు చేసి అమలు తీరును పరీక్షించింది. మాస్టర్‌ ప్లాన్‌లో రోడ్‌ నెట్‌వర్క్, జనాభా, భౌగోళిక అంశాల వంటి 40 అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది.

పట్టణ ప్రగతి కింద ఇప్పటికే..
పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటికే ప్రభుత్వం మున్సిపాలిటీలకు రూ. 2,062 కోట్లు విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 858 కోట్ల వ్యయంతో 49 నాలాల అభివృద్ధి పనులను 15 ప్యాకేజీల కింద చేపట్టింది. 2,067 పట్టణ ప్రకృతి వనాలు, 400 కి.మీ. మేర రహదారుల వెంట మల్టీలెవల్‌ అవెన్యూ ప్లాంటేషన్‌ పనులను పురపాలక శాఖ చేస్తోంది. హైదరాబాద్‌ సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ మాస్టర్‌ ప్లాన్‌ కోసం రూ. 5 వేల కోట్లు వెచ్చించనుంది.

వరంగల్‌లో వ్యర్థాల బయో మైనింగ్‌ ప్రాజెక్టుతోపాటు పట్టణాల్లో బయో మైనింగ్, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, ఎఫ్‌ఎస్‌ఏపీలను సిద్ధం చేయనుంది. 38 పట్టణాల్లో రూ. 1,433 కోట్లతో నీటిసరఫరా పథకాలు, రూ. 700 కోట్లతో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్లు, రూ. 61 కోట్లతో మెహదీపట్నం, ఉప్పల్‌లో స్కై వాక్‌ నిర్మాణాలతోపాటు కొత్వాల్‌గూడ దగ్గర్లో 85 ఎకరాల్లో ఎకో పార్క్‌ ఏర్పాటు వంటివన్నీ మాస్టర్‌ ప్లాన్‌లో భాగమే.

70 పట్టణాల్లో మాస్టర్‌ ప్లాన్లు రెడీ...
రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్‌ తదితర కార్పొరేషన్లలో ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్లను సిద్ధం చేశారు. మొత్తంగా 70 నగరాలు, పట్టణాల్లో మాస్టర్‌ ప్లాన్‌లు సిద్ధమయ్యాయని, మరో 37 మున్సిపాలిటీలకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌లను నెల రోజుల్లో సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top