డిటెన్షన్‌ సెంటర్‌ @ వికారాబాద్‌! 

Detention Centre To Come Up In Vikarabad For Foreign Offenders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులకు ‘విదేశీయుల’ వేధింపులు తప్పనున్నాయి. తమ సొంత దేశాలకు బలవంతంగా తిప్పి పంపాల్సిన (డిపోర్టేషన్‌) వారిని ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉంచేందుకు ఉద్దేశించిన డిటెన్షన్‌/డిపోర్టేషన్‌ సెంటర్‌ వికారాబాద్‌కు మారనుంది. కనిష్టంగా 40 మందిని ఉంచేలా దీన్ని నిర్మిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది.  

  • నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు వంటి ఆఫ్రికన్‌ దేశాల నుంచి అనేక మంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్‌ వస్తున్నారు. వీరిలో అనేక మంది వీసా, పాస్‌పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డుల సహకారంతో తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసేవాళ్లు. అనుమానాస్పద కదలికలు ఉన్నా, కొన్ని రకాలైన నేరాలకు పాల్పడినా ఇలాన చేసేవాళ్లు. దీంతో కోర్టులో ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్‌కు అవకాశం ఉండేది కాదు. 
  • బెయిల్‌పై బయటకు వచ్చే వాళ్లు సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ విక్రయిస్తున్నారు. ఇలా అత్యంత సమస్యాత్మక వ్యక్తులుగా మారుతున్న వీరి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. ఇది గమనించిన నగర పోలీసులు ఇలాంటి వారిని అరెస్టు చేయడానికి బదులు డిపోర్ట్‌ చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ డిపోర్టేషన్‌ ప్రక్రియలో అనేక ఘట్టాలు ఉంటాయి. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరి గుర్తింపులు, ఢిల్లీ కార్యాలయం నుంచి టెంపరరీ ట్రావెల్‌ డాక్యుమెంట్లు పొందాలి. ఆపై విమాన టిక్కెట్లు ఖరీదు చేసి సదరు ఎయిర్‌వేస్‌ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఫారెనర్స్‌ రీజనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) నుంచి ఎగ్జిట్‌ పర్మిట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.  
  • ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పట్టే రెండు నెలల కాలంలో వీరిని డిపోర్టేషన్‌ సెంటర్‌ ఉంచాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్‌ విశాఖపట్నంలో ఉండేది. ఆపై తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్‌ సీసీఎస్‌ డిపోర్టేష¯న్‌ సెంటర్‌గా మారింది. కేవలం అయిదుగురిని మాత్రమే ఉంచడానికి సరిపోయే జైలు గదినే దీనికి వాడుతున్నారు. దీంతో పాటు వారికి అనువైన ఆహారం అందించలేకపోవడంతో ఆయా విదేశీయులు చేసే రాద్ధాంతంతో సీసీఎస్‌ పోలీసులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు విభాగం ప్రత్యేకంగా డిపోర్టేషన్‌ సెంటర్‌ ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వికారాబాద్‌లో డిపోర్టేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్‌లేటర్లు, వారికి అనువైన ఆహారం వండి ఇవ్వడానికి కుక్స్‌తో సువిశాల స్థలం మధ్యలో భవంతులతో నిర్మిస్తున్నారు. కనిష్టంగా 40 మందికి సరిపోయేలా రూపొందుతోంది.    

(చదవండి: తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం.. రైతన్నలకు డ్రోన్లు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top