సోనియా బర్త్‌డే కటాఫ్‌? | decision of state government on crop loan waiver: ts | Sakshi
Sakshi News home page

సోనియా బర్త్‌డే కటాఫ్‌?

May 18 2024 4:08 AM | Updated on May 18 2024 4:15 AM

decision of state government on crop loan waiver: ts

పంట రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం

గత డిసెంబర్‌ 9 వరకున్న రుణాలకు మాఫీ వర్తింపు 

తెలంగాణ ప్రకటన తేదీ కూడా కావడంతో సెంటిమెంట్‌గా భావిస్తున్న సర్కారు 

గత రుణమాఫీ కటాఫ్‌ నుంచి ఈ తేదీ వరకు లెక్క... నాలుగేళ్ల కాలంలో తీసుకున్న రుణాల మాఫీ 

రైతు కాకుండా రైతు కుటుంబం యూనిట్‌గా అమలు 

ఒకేసారి రుణమాఫీ ఎలా జరుగుతుందోనని అధికారుల్లో చర్చ 

వడ్డీతో కలిపి దాదాపు రూ.40 వేల కోట్ల వరకు అవసరమని అంచనా 

మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్న వ్యవసాయశాఖ

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన తేదీ అయిన డిసెంబర్‌ 9ని పంట రుణ మాఫీకి కటాఫ్‌ తేదీగా ప్రకటించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. అదేరోజు తెలంగాణ ప్రకటన తేదీ కూడా కావడంతో దీన్ని సెంటిమెంట్‌గా కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్‌ 7ను రుణ మాఫీకి కటాఫ్‌ తేదీగా చేయాలనే చర్చ కూడా జరుగుతోందని చెబుతున్నారు. ఈ రెండు తేదీల్లోనూ సోనియా పుట్టిన రోజునే కటాఫ్‌ తేదీగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.  

గతంలో డిసెంబర్‌ 11వ తేదీ కటాఫ్‌ 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు 2019 డిసెంబర్‌ 11వ తేదీని కటాఫ్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ తేదీ నుంచి 2023 డిసెంబర్‌ 9వ తేదీ వరకున్న రైతుల వ్యవసాయ పంట రుణాలను మాఫీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే సరిగ్గా నాలుగేళ్ల మధ్య కాలంలో రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేస్తారని, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. గత డిసెంబర్‌ 9 తర్వాత నుంచి ఇప్పటివరకు రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ కాబోవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

మాఫీ కసరత్తు ముమ్మరం 
రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకేసారి రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోపుగా హామీ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో విధివిధానాలపై కసరత్తు వేగంగా జరుగుతోంది.  

వడ్డీపై తర్జనభర్జన 
రైతు యూనిట్‌గా కాకుండా, రైతు కుటుంబం యూనిట్‌గా రుణమాఫీని అమలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ కాబట్టి రైతుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. 2020లో రూ.25 వేల లోపు రుణాలు మాఫీ (రూ.408.38 కోట్లు) చేశారు. ఆ తర్వాత రూ.25 వేల నుంచి రూ.37 వేల లోపు రైతులకు చెందిన కొందరికి రూ.763 కోట్ల రుణాలను మాఫీ చేశారు. ఇలా విడతల వారీగా మాఫీ చేశారు.

తాజాగా కటాఫ్‌ తేదీని డిసెంబర్‌ 9వ తేదీగా ప్రకటిస్తే..అప్పటివరకు రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయలలోపు రుణాలను మాఫీ చేస్తారు. అయితే రుణ బకాయిలకు వడ్డీ కూడా తోడు కానుంది. అంటే బ్యాంకులకు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఏం చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వాస్తవ రుణ బకాయిలు రూ.30 వేల కోట్లు ఉంటే, వడ్డీతో కలిపి దాదాపు రూ.40 వేల కోట్ల వరకు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంటుంది. కటాఫ్‌ తేదీని బట్టి ఇది మారుతుందని అంటున్నారు.  

బంగారం కుదవబెట్టి, సాగు చేయని భూములకు రుణాలు తీసుకుంటే..? 
బంగారం కుదువబెట్టి తీసుకున్న పంట రుణాలకు కూడా మాఫీ వర్తింపచేయాలా వద్దా అన్నదానిపై చర్చ జరుగుతోంది. రైతుబంధు సొమ్మును అందరికీ ఇచ్చి దురి్వనియోగం చేశారంటూ విమర్శలు వచి్చన నేపథ్యంలో రుణమాఫీని కూడా సమగ్రంగా పరిశీలించాకే వర్తింప జేయాలనే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. కొందరు రైతులు సాగు చేయని భూములకు, కొండలు గుట్టలకు కూడా పంట రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

సొంత అవసరాలకు కూడా ఏదో రకంగా పంట పేరుతో రుణాలు తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఇటువంటి వారికి కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే గత ఐదేళ్లలో ఎవరు సాగు చేశారో చేయలేదో ఇప్పుడు తెలుసుకోవడం కష్టం అవుతుందని, కొండలు గుట్టల పేరుమీద రుణాలు తీసుకుని ఉంటే వాటిని గుర్తించగలమా లేదా అనే చర్చ అధికారుల్లో జరుగుతోంది. ప్రధానంగా ఒకేసారి రుణమాఫీ అనేది ఎలా జరుగుతుందోనన్న చర్చ కూడా వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారుల మధ్య జోరుగా సాగుతోంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ రుణమాఫీకి మార్గదర్శకాలను ఖరారు చేసే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.  

గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీకి సంబంధించిన వివరాలు 
లక్ష లోపు రుణాలు                             రైతులు            రుణాలు 
0– రూ.25 వేలు                                   2.96 లక్షలు     రూ.408.38 కోట్లు 
రూ.25 వేలు– రూ.50 వేలు                  5.72 లక్షలు     రూ.1790 కోట్లు 
రూ.50 వేలు– రూ.75 వేలు                  7 లక్షలు         రూ.4000 కోట్లు 
రూ.75 వేలు – రూ.లక్ష                      21లక్షలు          రూ. 13000కోట్లు 
మొత్తం                                             36.68 లక్షలు    రూ. 19,198.38 కోట్లు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement