కొత్త ఎయిర్‌పోర్టులపై త్వరలో మరో ముందడుగు

Decision For Six New Airports To Be Built In The State - Sakshi

వారం పదిరోజుల్లో పూర్తికానున్న ప్రాథమిక కసరత్తు  

ఇప్పటికే సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక 

త్వరలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్న కన్సల్టెన్సీ సంస్థ 

ఆ తర్వాత అసలు ప్రక్రియ షురూ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఆరు కొత్త విమానాశ్రయాలకు సంబంధించి మరో వారం పదిరోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. ఆయా ప్రాజెక్టులకు కన్సల్టెంటుగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. విమానాశ్రయాల ప్రాథమిక స్వరూపాన్ని వివరించనుంది. ఈ సంస్థ గత జూన్‌లోనే వీటికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల (టెక్నో ఎకనమిక్‌ ఫీజబిలిటీ) నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. తాజాగా ఆరు విమానాశ్రయాలకు ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను వివరించడంతో పాటు వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించనుంది. దీంతో వీటికి సంబంధించిన ప్రాథమిక కసరత్తు పూర్తి అవుతుంది. ఆ తర్వాత నిర్మాణానికి సంబంధించిన అసలు ప్రక్రియ మొదలు కానుంది.  

అనుమానాల నివృత్తి.. అంచనా వ్యయంపై స్పష్టత 
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే మొత్తం రాష్ట్ర అవసరాలను తీరుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుదిక్కులా కొత్త విమానాశ్రయాల ఏర్పాటు అవసరమని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు నివేదిక కోరుతూ కన్సల్టెన్సీ బాధ్యతను ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ వాణిజ్య విభాగానికి అప్పగించింది. దాని ప్రతినిధులు పలుమార్లు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు.

వరంగల్‌ మామునూరు, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఉన్న పాతకాలం నాటి శిథిలమైన ఎయిర్‌స్ట్రిప్స్‌ను పునరుద్ధరించ (బ్రౌన్‌ఫీల్డ్‌) వచ్చని తెలిపారు. వాటితో పాటు నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రల వద్ద కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులను ప్రతిపాదించారు. వీటన్నిటిలో విమానాశ్రయాల నిర్మాణం సాధ్యమేనని తేల్చి ప్రాథమిక నివేదిక అందజేశారు. ఆ తర్వాత వాటి నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలు, కావాల్సిన భూమి వివరాలు, ఆయా విమానాశ్రయాల నిర్మాణం జరగాలంటే తీసుకోవాల్సిన చర్యలతో ఫీజబిలిటీ రిపోర్టును అందజేశారు.

డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ విమానాశ్రయాలకు సంబంధించి ఫేజ్‌–1, ఫేజ్‌–2 పేరుతో రెండు వేరువేరు అంచనాలను అందజేశారు. ఫేజ్‌–1 ప్రకారం రూ.1,350 కోట్లు, ఫేజ్‌–2 ప్రకారం రూ.2 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయం కానుంది. ఇక భూసేకరణకు ఇంతకు మించి ఖర్చు కానుంది. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గింపునకు సంబంధించి ఇప్పుడు జరగబోయే సమావేశంతో స్పష్టత రానుంది. ఇక పాల్వంచ, దేవరకద్ర, బసంత్‌నగర్‌ విమానాశ్రయాలకు సంబంధించి ఫీజబిలిటీ నివేదిక అస్పష్టంగా ఉంది. వీటిపైనా స్పష్టత ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది.  

ఆ రెండూ జీఎంఆర్‌కు..! 
ఆరు విమానాశ్రయాలను నిర్మిస్తామని, వెంటనే అనుమతి మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా విమానయాన శాఖను కోరారు. కానీ ప్రస్తుతం వ్యయ అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో రెండుమూడు ముందు చేపట్టి మిగతావి తర్వాత చేపడితే ఎలా ఉంటుందన్న విషయంలోనూ కొంత చర్చ జరుగుతోంది. దీనిపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రానుంది. మరోవైపు ఇప్పటికే మనుగడలో ఉన్న విమానాశ్రయానికి 150 కి.మీ. పరిధిలో రెండోది ఉండొద్దనే ఒక నిబంధన ఉంది. జీఎంఆర్‌ సంస్థ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఆ నిబంధన ప్రకారం చూస్తే మహబూబ్‌నగర్, వరంగల్‌ ఎయిర్‌పోర్టులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చనే అంశంపై కూడా సమావేశంలో సూచనలు అందే అవకాశం ఉంది. ఆ రెంటినీ జీఎంఆర్‌కు అప్పగించే అంశాన్ని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top