దళితబంధు షురూ.. వెంటనే పథకం అమల్లోకి: సీఎం కేసీఆర్‌

Dalita Bandhu Scheme To Be Launched From Vasalamarri - Sakshi

యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్‌ 

76 కుటుంబాల కోసం రూ.7.60 కోట్లు విడుదల 

గురువారమే లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ 

ఆ ఊరిలోని దళితులందరికీ భూమి ఇస్తాం 

పాత ఇండ్లు తొలగించి కొత్త ఇండ్లు కట్టుకుందాం 

ఇంటింటికి వెళ్లి.. సమస్యలు విని..
వాసాలమర్రి పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ దళితవాడలో ఇల్లిల్లూ తిరుగుతూ వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు ఇస్తే ఏం చేస్తారంటూ ఆరా తీశారు. డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొందరి సమస్యలు విని.. వెంటనే పరిష్కరించాలంటూ అక్కడిక్కడే అధికారులను ఆదేశించారు.

ట్రాక్టర్‌ ఇప్పిస్తం.. 
సీఎం కేసీఆర్‌ను కలిసిన జెరిపోతుల పోశమ్మ తన కూతురికి ఏదైనా సాయం చేయాలని కోరింది. తనకు కూతురు ఒక్కతే ఉందని, అల్లుడు డ్రైవర్‌గా పనిచేస్తాడని చెప్పింది. దీనితో కేసీఆర్‌ స్పందిస్తూ.. ఆమె అల్లుడికి దళితబంధు కింద ట్రాక్టర్‌ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 

వెంటనే పనిముట్లు ఇప్పించండి! 
సీఎం: నీ పేరేంది, ఏం పనిచేస్తవు? 
కలకొండ కృష్ణాచారి. వడ్ల పనిచేస్తా. 
సీఎం: ఎంతమంది పిల్లలు ? 
కృష్ణాచారి: ముగ్గురు పిల్లలు 
సీఎం: ఏ కావాలి నీకు? 
కృష్ణాచారి: పనిముట్లు కావాలె, ఇంటికి ప్లాస్టరింగ్‌ లేదు 
సీఎం: సరే నీకు సాయం అందుతది. 
వెంటనే కృష్ణాచారికి పనిముట్లు ఇప్పించాలని, అతడి ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేయించాలని అక్కడే కలెక్టర్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

దళితులందరికీ భూమి 
వాసాలమర్రిలో దళితులందరికీ భూమి పంపిణీ జరుగుతుంది. భూమి ఉన్నవారు ఎందరు, ఎంత ఉంది, భూమి లేనివారు ఎందరనేది పరిశీలిస్తున్నాం. గ్రామంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో దళితులకు ఇచ్చిన 612 ఎకరాల అసైన్డ్‌ భూముల్లో ఆక్రమణలకు గురైన వాటిని రికవరీ చేస్తాం. వాటిని అందరికీ పంచుతాం. కాళేశ్వరం నీళ్లు వస్తాయి కాబట్టి పంటలు పండించుకోవచ్చు. 

సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం ‘దళిత బంధు’పథకాన్ని బుధవారం నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.7.60 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వాసాలమర్రి దళితులందరికీ భూమి ఇస్తామని, ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. బుధవారం వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. అక్కడి దళిత కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 


వాసాలమర్రి గ్రామంలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్‌ 

వెంటనే పథకం అమల్లోకి..: దళితులు కష్టపడేతత్వం కలవారు. అలాంటి వారు పేదరికంలో ఉండొద్దు. వ్యాపారం, స్వశక్తితో స్వయంగా ఆర్థికాభివృద్ధి సాధించాలి. ఈ రోజు నుంచే దళిత బంధు పథకం లాంచ్‌ అవుతున్నట్లు ప్రకటిస్తున్నాను. వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున గురువారం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. వాసాలమర్రి గ్రామ దళితులు ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా పైకి ఎదిగి ఆలేరు నియోజకవర్గానికి దారి చూపాలి. రాష్ట్రంలో ఏడాది కిందనే దళిత బంధు అమలు కావాల్సి ఉంది. ఆరునూరైనా ఈ పథకాన్ని గొప్పగా అమలు చేస్తాం. రాష్ట్రంలో 15– 16 లక్షల దళిత కుటుంబా లు ఉన్నాయి. అందులో ఎలాంటి ఆధారం లేనివారికి దళిత బంధు పథకం ద్వారా ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తాం. ఈ పథకం కింద రూ.30కోట్లతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తాం. అనారోగ్యం, అనుకోకుండా వచ్చే ఇతర కష్టాలతో దళితులు దెబ్బతినకుండా ఇది ఉపయోగపడుతుంది. వాసాలమర్రితోపాటు అన్నిచోట్లా దళితుల మధ్య ఐకమత్యం ఉండాలి. ఏమైనా పోలీస్‌ కేసులు ఉన్నా రద్దు చేసుకోవాలి. 

యువతే కేసీఆర్‌ ఆస్తి.. 
దళిత సమాజంలోని చదువుకున్న యువతే కేసీఆర్‌ ఆస్తి. వారు ఎక్కువ బాధ్యత తీసుకుని, కుటుంబ సభ్యుల సమష్టి ఆలోచనలతో ఎదగాలి. దళిత కాలనీల్లో డబుల్‌ బెడ్రూం ఇళ్లు, మురికి కాలువలు, రోడ్లు నిర్మిస్తాం.  

భూముల సమస్య పరిష్కరిస్తాం
వాసాలమర్రిలో దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసి కేసీఆర్‌కు ధైర్యం కల్పించాలి. రాబోయే 15 రోజుల్లో గ్రామంలో భూముల సమస్య పరిష్కరిస్తాం. మళ్లీ ఆరు నెలల తర్వాత దళితవాడలో తిరిగి సమావేశమై అందరం భోజనం చేద్దాం. ఎవరెవరు ఎలా అభివృద్ధి చెందుతున్నారనేది మాట్లాడుకుందాం. ఇండ్లు కూడా పాతవి తీసేసి కొత్త ఇండ్లు కట్టుకుందాం. వాసాలమర్రిని ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా బంగారు వాసాలమర్రి అయ్యేలా సమష్టి కృషిచేద్దాం’’అని సీఎం చెప్పారు. వాసాలమర్రి పర్యటనలో సీఎం వెంట ఎంపీ సంతోష్‌కుమార్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 


వృద్ధురాలి పరిస్థితిని ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్‌ 

ఆగవ్వను ఆపారు!
వాసాలమర్రిలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాసాలమర్రికి తొలిసారి వచ్చినప్పుడు సీఎం పక్కన కూర్చొని భోజనం చేసిన ఆగవ్వ.. బుధవారం దళితవాడలో సీఎంను కలిశారు. అయితే రైతు వేదిక వద్ద దళితులతో నిర్వహించిన సమావేశానికి వెళ్తున్న ఆమెను పోలీసులు ఆపేశారు. ‘నేను ఆగవ్వను, సీఎం సారుతో అన్నం తిన్న..’ అని చెప్పినా పంపలేదు. ఆమె నిరాశతో ఇంటికి వెళ్లిపోయింది. ఇక పోలీసులు తమను వ్యవసాయభూముల వద్దకు వెళ్లనివ్వక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీడీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు
గ్రామంలోని పలు ఇతర కాలనీల్లోనూ సీఎం పర్యటించారు. అధికారులు రూపొందించిన రోడ్‌మ్యాప్‌ ప్రకారం కాకుండా వేర్వేరు వీధుల్లోకి వెళ్లారు.  నిరుపేద మహిళలు, వృద్ధులు చెప్పిన సమస్యలను ఓపికగా విని, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమకు పెన్షన్‌ రావడం లేదని విన్నవించుకున్న సుమారు 20 మంది మహిళా బీడీ కార్మికులకు రెండు రోజుల్లో పెన్షన్‌ మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్తుండగా సీఎం స్పందించి.. ‘‘నేను బీడీలు చేసేటోళ్ల ఇంట్లో ఉండే చదువుకున్న. వాళ్ల కష్టాలు నాకు తెలుసమ్మా’ అని చెప్పారు. వాసాలమర్రిని తాను దత్తత తీసుకున్నానని, గ్రామంలో అందరికీ ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పర్యటన సందర్భంగా సర్పంచ్‌ అంజయ్య ఇంట్లో కేసీఆర్‌ భోజనం చేశారు.

నీకు డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. 
దళితవాడలో దుబాసీ శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లిన సీఎం అది శిథిలమై ఉండటాన్ని చూశారు. ‘అరె.. ఎట్లుంటున్నరయ్యా ఈ ఇంట్లో.. వాన వస్తే నీళ్లు వస్తలేవా?’ అని అడిగారు. దాంతో.. ‘పరిస్థితి బాగాలేదు కూలినాలి చేసుకుని బతుకుతున్నం. బతుకుదెరువు కష్టంగా ఉంది’ అని శ్రీనివాస్‌ బదులిచ్చాడు. దీనిపై స్పందించిన సీఎం.. ‘నీకు డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టిస్తా. మీ ఊరందరు సహకరిస్తే తొందరలోనే పూర్తి చేసుకుందాం..’ అని భరోసా ఇచ్చారు.

ఇంటింటికీ తిరిగి.. 
సీఎం కేసీఆర్‌ సుమారు మూడు గంటల పాటు వాసాలమర్రిలో కలియదిరిగారు. దళితవాడతోపాటు ఇతర వాడల్లో కాలినడకన పర్యటించారు. స్వయంగా వినతిపత్రాలను స్వీకరించారు. దళిత మహిళలు సీఎం కేసీఆర్‌కు బొట్టుపెట్టి, మంగళ హారతులతో స్వాగతం పలికారు. దళితవాడలో తొలుత కొండపురం నర్సమ్మ ఇంటివద్ద సీఎం కేసీఆర్‌ ఆగారు. తనకు పింఛన్‌ ఇప్పించాలని ఆమె కోరగా.. వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. వాడలో కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను చూసి ఆయన చలించిపోయారు. అందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళితబంధు పథకం కింద రూ.10 లక్షలు ఇస్తే ఎలా ఖర్చుచేస్తారని సీఎం ప్రశ్నించగా.. కొందరు ఇల్లు కట్టుకుంటామని, పాత ఇండ్లు మరమ్మతు చేసుకుంటామని, భూమి అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం.. ఇల్లులేని వారికి ఇల్లు మంజూరు చేస్తానని, దళితబంధు డబ్బులను ఉపాధి కోసమే ఉపయోగించుకోవాలని సూచించారు. 

భోజనానికి రండి.. 
గజ్వేల్‌/మర్కూక్‌: వాసాలమర్రిలో పర్యటన ముగించుకున్న సీఎం తిరుగు ప్రయాణంలో.. గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని కాశిరెడ్డిపల్లి వద్ద కాసేపు ఆగారు. ‘అంతా మంచిగున్నరా.. అంటూ పలకరించారు. గ్రామంలో పలు సమస్యలు తీర్చాలంటూ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సింగం సత్తయ్య, మల్లేశం వినతి పత్రం అందజేశారు. గ్రామంలోకి రావాలని కోరారు. అయితే.. గ్రామంలోని ముఖ్యులు 10వ తేదీ తర్వాత ఫామ్‌హౌస్‌లో భోజనానికి రావాలని సీఎం సూచించారు. గ్రామ అభివృద్ధిపై చర్చించుకుని, ప్రణాళికాబద్ధంగా ముందుకుపోదామన్నారు. సీఎం స్పందనతో గ్రామస్తుల్లో సంతోషం కనిపించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top