డిజిటల్‌ అరెస్టుకు మ‌హిళ బ‌లి | Cyber ​​fraudsters harass people in the name of digital arrest | Sakshi
Sakshi News home page

Hyderabad: డిజిటల్‌ అరెస్టుకు మ‌హిళ బ‌లి

Sep 18 2025 4:16 AM | Updated on Sep 18 2025 2:23 PM

Cyber ​​fraudsters harass people in the name of digital arrest

సీబీఐ కేసు పేరుతో సైబర్‌ నేరగాళ్ల ఫోన్‌కాల్‌ 

రూ.6.6 లక్షలు స్వాహా చేసినా వదలని వైనం 

మూడు రోజుల పాటు ‘నిర్బంధం’తో హార్ట్‌స్ట్రోక్‌ 

చికిత్స పొందుతూ ప్రభుత్వ మాజీ వైద్యురాలి మృతి 

నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ అరెస్టు పేరుతో సైబర్‌ మోసగాళ్ల వేధింపులకు ఓ వృద్ధురాలు బలైంది. హైదరాబాద్‌ మధురానగర్‌కు చెందిన మహిళ (76) చంచల్‌గూడ ఆఫీసర్స్‌ కాలనీలో ఉన్న మామిడిపూడి నాగార్జున ఏరియా ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమెకు ఈ నెల 5న తొలిసారి సైబర్‌ నేరగాళ్ల నుంచి వాట్సాప్‌ వీడియో కాల్‌ వచ్చింది. బెంగళూరు పోలీసు లోగో, పోలీసు డ్రెస్‌లో ఉన్న వ్యక్తి ఫొటోతో కూడిన ప్రొఫైల్‌ పిక్చర్‌ వినియోగించి సైబర్‌ నేరగాళ్లు వృద్ధురాలితో మాట్లాడారు. 

ఆమె ఆధార్‌ కార్డు వివరాలు దుర్వినియోగం అయ్యాయని, మనుషుల అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి కేసు నమోదైందని బెదిరించారు. సుప్రీంకోర్టు జారీ చేసినట్లు సీల్‌తో ఉన్న నకిలీ పత్రాలను షేర్‌ చేశారు. ఈ కేసు సదాకత్‌ ఖాన్‌ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసుకు అనుబంధంగా నమోదైందని, అరెస్టు తప్పదని భయపెట్టారు. అరెస్టు కాకుండా ఉండాలంటే తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భయపడిపోయిన బాధితురాలు సెపె్టంబర్‌ 6న తన బ్యాంకు ఖాతాలో ఉన్న పెన్షన్‌ సొమ్ము రూ.6.6 లక్షలు సైబర్‌ నేరగాళ్లు సూచించిన ఖాతాలోకి బదిలీ చేసింది. 

ఆ బ్యాంకు ఖాతా మహారాష్ట్రలోని ఓ షెల్‌ కంపెనీ పేరుతో ఉన్నట్లు తేలింది. ఆపై మరో నంబర్‌ నుంచి బాధితురాలికి వీడియో కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. న్యాయస్థానం జారీ చేసినట్లు తయారు చేసిన నకిలీ నోటీసులు పంపారు. తమ నుంచి క్లియరెన్స్‌ వచ్చేవరకు వీడియో కాల్‌ ఆన్‌లోనే ఉండాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 8 వరకు ఇలా ‘నిర్బంధం’లో ఉండిపోయిన వృద్ధురాలు విషయం ఇంట్లో వారికి కూడా చెప్పలేదు. ఆ ఒత్తిడితో గుండెపోటుకు గురై కిందపడిపోయారు. 

కుటుంబీకులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆమె ఫోన్‌ను కుటుంబ సభ్యులు పరిశీలించగా డిజిటల్‌ అరెస్టు గురించి తెలిíసింది. దీంతో ఆమె కుమారుడు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా ఐటీ యాక్ట్‌తో పాటు బీఎన్‌ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు.  

ఏమిటీ సదాకత్‌ ఖాన్‌ కేసు? 
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ జిల్లాకు చెందిన ఘరానా నేరగాడు సదాకత్‌ ఖాన్‌. మన దేశం నుంచి అనేకమందిని ఉద్యోగా ల పేరుతో కాంబోడియా తీసుకెళ్లి సైబర్‌ ముఠాలకు అప్పగించేవాడు. అక్కడ వారితో బలవంతంగా సైబర్‌ నేరాలు చేయించే వారు. సిరిసిల్లకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది నవంబర్‌ 6న దుబాయ్‌ నుంచి వచి్చన సదాకత్‌ ఖాన్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి సైబర్‌ నేరగాళ్లు డిజిటల్‌ అరెస్టు పేరు తో ప్రజలను మోసం చేయడానికి ఈ కేసును వాడుతున్నారు.  

ప్రపంచంలో ఎక్కడా డిజిటల్‌ అరెస్టు లేదు
దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఓ నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని డిజిటల్‌ అరెస్టు చేసే విధానం అమలులో లేదు. ఏ పోలీసు అధికారి వీడియో కాల్‌ చేసి కేసు నమోదైందని చెప్పరు. నిందితుడిగా ఆరోపణలు ఉంటే... ఫోన్‌ చేసి పోలీసుస్టేషన్‌కు రమ్మని పిలుస్తారు. ఏ కేసులో అయినా నిర్దోషిత్వం నిరూపించుకోవాలంటే దర్యాప్తు అధికారులను నేరుగా కలిసి తగిన ఆధారాలు సమర్పించాలి. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందాలి. మీ ప్రమేయం లేకుండా ఆధార్, పాన్‌కార్డు వంటివి దుర్వినియోగమైనా ప్రమాదం ఉండదు. బాధితుల భయమే సైబర్‌ నేరగాళ్ల పెట్టుబడి అని గుర్తుంచుకోవాలి.  
– సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement