
ఇన్వెస్ట్‌మెంట్ మోసంలో వ్యాపారవేత్త నుంచి కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
సాక్షి, హైదరాబాద్: కేవలం 65 రోజుల్లో రూ. 7.88 కోట్లు కొల్లగొట్టిన భారీ మోసం కేసు ఇది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకి చెందిన 55 ఏళ్ల వ్యాపారవేత్త ఒక నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టి రూ. 7.88 కోట్లు కోల్పోయాడు. అతను కొంతమంది తెలియని వ్యక్తుల ద్వారా సులభమైన లాభాల కోసం ఒక వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెట్టారు. భారీ లాభాలు వచి్చనట్టు చూపినా.. నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కాకపోవడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు ఇలా.. జూలై 25న కేపీహెచ్‌బీకి చెందిన వ్యాపారి పి.నాగేశ్వరరావుకు సత్యనారాయణ, వైశాలి అనే పేర్లతో గుర్తు తెలియని వ్యక్తులు ‘ఫినాల్టో ఇండస్’ అనే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన వాట్సాప్ లింక్ పంపి అతన్ని అందులో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. తాము యూకే స్టాక్ ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌లతో సంబంధం కలిగి ఉన్నట్లు నమ్మించారు. మొదట జూలై 25న, అతను యూపీఐ ద్వారా రూ. 45,000 పెట్టుబడి పెట్టాడు. దీంతో అతని ట్రేడింగ్ ఖాతా 15% లాభాన్ని చూపించింది. గణనీయమైన లాభాలను సంపాదించాలంటే, రొటీన్ ట్రేడింగ్, ఐపీఓ కోసం భారీ మూలధనాన్ని పెట్టుబడి పెట్టాలని వారు ఒత్తిడి చేశారు. మొదట్లో, అతను తన నమ్మకాన్ని బలపరచడానికి రూ. 8,600 విత్‌డ్రా చేశాడు.
వారిని ఒప్పించడంతో, అతను 65 రోజుల వ్యవధిలో మొత్తం రూ. 7,88,18,233 పెట్టుబడి పెట్టాడు. ఈ కాలంలో, ఖాతా సుమారు రూ. 11 కోట్ల లాభాన్ని చూపించారు. సెపె్టంబర్ 30న, అతను తన నిధులను విత్‌డ్రా చేయడానికి యత్నించినప్పుడు, 30% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయిన రూ. 3 కోట్లు చెల్లించాలని వారు తెలిపారు. దీంతో ట్యాక్స్, విత్‌డ్రాయల్ నిబంధనల చట్టబద్ధతపై అతనికి అనుమానాలు కలిగాయి. అప్పుడు, అతను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. అధికారులు కేసును నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.