గోదావరిలో మొసళ్లు!.. బెంబేలెత్తుతున్న భక్తులు..

Crocodile Spotted At Sriram Sagar VIP Pushkar Ghat - Sakshi

బాల్కొండ : శ్రీ రాంసాగర్‌ ప్రాజెక్ట్‌ దిగువన గోదావరిలో మొసళ్ల సంచారం  పెరిగింది. శుక్రవారం పుష్కర ఘాట్‌ వద్ద పెద్ద మొసలి కనిపించడంతో  పుణ్య స్నానాలకు వెళ్లిన భక్తులు ఒక్క సారిగా బెంబేలెత్తిపోయారు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహంలో మొసళ్లు కొట్టుకు వచ్చి ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా మొసళ్ల ఉనికితో నదికి వచ్చే భక్తులతో పాటు జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే పలు గ్రామాల్లోని చెరువుల్లో మొసళ్లు  కనిపించాయి.

దీంతో కొన్ని చెరువుల్లో ఇప్పటికీ మత్స్యకారులు చేపలు పట్టడం లేదు. ముప్కాల్‌ మండల నల్లూర్‌  ఊర చెరువులో రెండు పెద్ద మొసళ్లు గత ఏడాది నుంచి సంచరిస్తున్నాయి. మెండోరా మండలం బుస్సాపూర్‌ ఊర చెరువులో రెండు మొసళ్లు ఉండ గా ఒక మొసలిని ఫారెస్ట్‌ అధికారులు పట్టుకున్నారు.

రెండో మొసలి గురించి ఇప్పటికీ పత్తాలేదు. ముప్కాల్‌ మండలం వెంచిర్యాల్‌ వద్ద కాకతీయ కాలువ పక్కన గల చిన్న చెరువులో మొసలి ఉండటంతో అధికారులు పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇలా మొసళ్లు అప్పుడప్పుడూ బయటపడుతూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా గోదావరిలోని స్నా నాల ఘాట్‌ వద్ద మొసలి కనిపించడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఉన్నతాధికారుల ఆదేశానుసారం
ఉన్నతాధికారుల ఆదేశానుసారం మొసళ్లను గోదావరిలో వదిలి పెడుతున్నాం. గోదావరిలో నీటిలోనే మొసలి ఉంటుంది. సేద తీరడం కోసం ఒడ్డుకు  వస్తుంటుంది. అలా వచ్చిన మొసలిని పట్టుకుని మళ్లీ నీరు అధికంగా ఉన్న ప్రాంతంలో వదిలేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటాం.   – గణేశ్, సెక్షన్‌ ఆఫీసర్, మెండోరా 

చెరువుల్లో పట్టి నదిలో వదిలి.. 
చెరువుల్లో పట్టుకున్న మొసళ్లను ఫారెస్టు అధి కారులు ఎస్సారెస్పీ దిగువన గోదావరిలో వదులు తున్నారు.  మెండోరా మండలం బు స్సాపూర్‌ చెరువులో మే నెలలో  జాలరుల వలకు చిక్కిన మొసలిని దూదిగాం శివారు లోని గోదావరిలో  వదిలి వేశారు. ఆ సమయంలో నదిలో నీరు కూడా లేదు. అలా వది లేస్తే  గోదావరికి పుణ్య స్నానాల కోసం వచ్చే భక్తుల పరిస్థితి ఏంటని పలువురు నిరసన వ్యక్తం చేశారు.

రెండేళ్ల క్రితం దూదిగాం శివారులో జాతీయ రహదారి 44 పైకి పెద్ద మొసలి వచ్చి నానా హంగామా చేసింది. ఫారెస్ట్‌ అధికారులు ఎక్కడెక్కడో చెరువుల్లో దొరికిన మొసళ్లను పట్టుకు వచ్చి గోదావరిలో వదిలి వేస్తున్నారని, తిరిగి అవే మొసళ్లు చెరువుల్లోకి వచ్చి చేరుతున్నాయని గ్రామీ ణులు ఆరోపిస్తున్నారు. ప్రతి శుక్ర సోమవారాల్లో గోదావరిలోకి స్నానానికి భక్తులు, నిత్యం బట్టలు ఉతుక్కోవడానికి  గ్రామస్తు లు  వెళ్తుంటారు. మొసళ్ల వలన ప్రమాదాల భారిన పడితే ఎవరు దిక్కు అని ప్రశి్నస్తున్నారు. పట్టుకున్న మొసళ్లను జంతు ప్రదర్శన శాలకో,  జంతువుల పెంపకం ప్రదేశాలకో పంపించాలని కోరుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top