అప్రమత్తతే రక్ష | Covid-19 cases rise in Telangana | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే రక్ష

Jun 8 2025 5:50 AM | Updated on Jun 8 2025 5:50 AM

Covid-19 cases rise in Telangana

వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో 5,755 యాక్టివ్‌ కేసులు.. మరో ‘వేవ్‌’ రావొచ్చుననే భయాలు

అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్న వైద్య నిపుణులు

మాస్‌ వ్యాక్సినేషన్‌ అవసరం లేదు: డా. జీసీ ఖిల్నానీ

వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వారు జాగ్రత్తగా ఉండండి: డా.హరికిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రోజురోజుకూ కోవిడ్‌–19 యాక్టివ్‌ కేసులు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఇటీవల కాలంలో మృతుల సంఖ్య సైతం ఏడుకు చేరుకోవడంతో (ఈ ఏడాది జనవరి 1 నుంచి చూస్తే మొత్తం 55 మరణాలు) మరో ‘కరోనా వేవ్‌’ముంచెత్తుతుందా అన్న భయాలు సైతం వివిధ వర్గాల ప్రజల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఐదు వేలకు పైబడి యాక్టివ్‌ కేసులు కొనసాగుతున్నాయి. కేరళలో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి.

కేరళలో శనివారం నాటికి (గత 24 గంటల్లో) 192, గుజరాత్‌లో 107, పశ్చిమబెంగాల్‌లో 58, కర్ణాటకలో 15, ఆంధ్రప్రదేశ్‌లో 12 కొత్త యాక్టివ్‌ కేసులు వెలుగు చూశాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ యాక్టివ్‌ కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పోర్టల్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం చూస్తే.. గత 24 గంటల్లో దేశంలో 391 యాక్టివ్‌ కేసులు నమోదు కావటంతో మొత్తం కేసుల సంఖ్య 5,755 చేరుకుంది. కరోనా మళ్లీ ప్రారంభమైన జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 59 మంది మరణించారు.

కాగా శుక్రవారం ఒక్కరోజే నలుగురు చనిపోయారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. కేరళ 1,806, గుజరాత్‌ 717, పశ్చిమబెంగాల్‌ 622, ఢిల్లీ 665, మహారాష్ట్ర 577, కర్ణాటక 451, తమిళనాడు 379, యూపీ–208, ఆంధ్రప్రదేశ్‌ 72, తెలంగాణలో 5 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మహారాష్టలో 18, కేరళలో 12 మంది, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏడుగురు చొప్పన మొత్తం 14 మంది చనిపోయారు.

పెద్దగా భయపడాల్సిన పనిలేదు
ప్రస్తుతం కేసుల వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్లు, లీనియేజ్‌లు ఎగువ శ్వాసకోశ వ్యవస్థ (అప్పర్‌ రెస్పిరేటరీ) పైనే ప్రభావం చూపుతున్నందున పెద్దగా భయపడాల్సిన పనిలేదు. రోగులు స్వల్ప లక్షణాలతోనే కొద్దిగా అనారోగ్యానికి గురవుతారు. దీని ట్రీట్‌మెంట్‌లో భాగంగా యాంటీ బయోటిక్స్‌ వాడొద్దు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, తీవ్రమైన మధుమేహ రోగులు జాగ్రత్తగా ఉండాలి. చైనా, థాయ్‌లాండ్, సింగపూర్‌ తదితర దేశాల్లో బూస్టర్‌ డోస్‌లు ఇస్తున్నారు.

కానీ ఈ వైరస్‌కు సంబంధించి ఎలాంటి వ్యాక్సిన్లు తయారు కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ‘మాస్‌ వ్యాక్సినేషన్‌’చేయాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ దశ కూడా నెమ్మదిగా ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీయకుండా తొలగిపోతుందనేది నా నిశ్చితాభిప్రాయం. – డా. జీసీ ఖిల్నానీ, చైర్మన్‌ పీఎస్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్, పూర్వ హెడ్, పల్మనాలజీ ఎయిమ్స్‌ ఢిల్లీ

స్వల్ప లక్షణాలు.. తక్కువ స్థాయి జ్వరం..
ప్రస్తుత కేసుల పెరుగుదలకు ప్రధానంగా కొత్త ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్లు ఎల్‌ఎఫ్‌ 7, ఎన్‌బీ 1.8.1 తదితరాలు కారణం. ఈ స్ట్రెయిన్లు స్వల్ప లక్షణాలతో తక్కువ స్థాయి జ్వరం, గొంతులో గరగరలతో సాధారణ జలుబు, సీజనల్‌ ఫ్లూ మాదిరిగా కనిపిస్తాయి. ఈ కారణంగా టెస్టింగ్‌కు ఆలస్యమై అనుకోకుండా వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలున్నాయి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యం ఉన్న వారు, బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్న వారిపై అధిక దుష్పరిణామాలు చూపే అవకాశాలున్నాయి. అందువల్ల ఎక్కువమంది గుమిగూడే చోట్లు, ప్రజారవాణా, మూసి ఉంచిన ప్రదేశాల్లో మాస్క్‌లు పెట్టుకోవాలి. చేతుల పరిశుభ్రత పాటించాలి. 
– డా.హరికిషన్‌ గోనుగుంట్ల, చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్, యశోద ఆసుపత్రి

Advertisement
 
Advertisement
Advertisement